RK Kotha Paluku: సాధారణంగా అధికార పార్టీ మీద ప్రజల్లో ఆగ్రహం తారాస్థాయిలో ఉంటే అది కచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి బలం అవుతుంది. ఎన్నికల ముంగిట ప్రతిపక్ష పార్టీ దూకుడుగా పని చేసేందుకు కారణం అవుతుంది. అలాంటి సమయంలో అధికార పార్టీ ఒక రకంగా డిఫెన్స్ లో పడుతుంది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగా పొత్తులకు ప్రయత్నించలేదు. కాకపోతే కెసిఆర్ తో పొత్తు కుదరకపోవడంతో సిపిఐ గత్యంతరం లేక కాంగ్రెస్ తో ప్రయాణించేందుకు వచ్చింది.. తెలంగాణ జన సమితి మిగతా పార్టీలు కూడా కేసీఆర్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ వైపు వచ్చాయి. ఆ పార్టీల బలం ఎంత అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సీట్ల కేటాయింపును అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఫలితంగా విజయాన్ని సాధించింది. సో ఇక్కడ పొత్తు కోణాన్ని పరిశీలించేకంటే.. అధికార భారత రాష్ట్ర సమితి ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సఫలికృతమైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం అంత సులువుగా సాధించలేదు. ఆ పార్టీ నాయకులు కష్టపడ్డారు కాబట్టే విజయం అనేది దక్కింది. అయితే త్వరలో ఎన్నికలు జరగబోయే ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుంది. అంటే అక్కడ జగన్ ప్రభుత్వం సుద్దపూస అని ఉద్దేశం కాదు.
ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షిక పేరుతో రాసిన వ్యాసంలో జగన్నాటకం త్వరలో ముగియ పోతోంది అని పేర్కొన్నారు.. దీని అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలే అని.. కప్పం కట్టే వారికే టికెట్లు ఇస్తున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రకృతి వనరులను విధ్వంసం చేసి కోట్లు గడించారని.. అలాంటి వ్యక్తి డబ్బులు వసూలు చేయడం ఏంటని రాధాకృష్ణ ప్రశ్నించారు.. కానీ ఇక్కడే ఆయన మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే.. ఒకవేళ జగన్ ఓడిపోయే పరిస్థితి ఉంటే టిడిపి ఎందుకు సొంతంగా ఎన్నికలకు వెళ్లలేకపోతోంది? బిజెపి, జనసేన, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుకు ఎందుకు తహతలాడుతోంది? టిడిపి నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు.. చంద్రబాబు నాయుడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐటిని ఆయన పరిచయం చేశారని అనుచరులు కూడా చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తి గత ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితమైపోయాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతగా అభివృద్ధి చేస్తే ప్రత్యర్థి పార్టీకి151 సీట్లు ఎలా దక్కేలా చేస్తాడు? ఇవేవీ రాధాకృష్ణకు తెలియవా? లేక తెలిసినా చంద్రబాబుకు అనుకూలంగా రాయాలి కాబట్టి రాస్తున్నాడా? తను ఒక జర్నలిస్టు కదా. అలాంటప్పుడు నేల విడిచి సాము లాంటి వార్తలు ఎలా రాయగలడు?
ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు చెప్పినా కూడా జగన్ పట్టించుకోవడంలేదని.. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నాడని రాధాకృష్ణ శోకాలు పెట్టాడు. వాస్తవానికి సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. పైగా ప్రజలతో నేరుగా సంబంధాలు లేని వారిని నిర్మొహమాటంగా పక్కన పెడతానని అతడు గతంలో పలుమార్లు చెప్పాడు. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన సభల్లో తన ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని కోరుతున్నాడు. తప్ప నాకు కచ్చితంగా ఓటు వేయాలని ప్రజలను అతడు అడగడం లేదు. అలాంటప్పుడు జగన్ ఎమ్మెల్యేలను మార్చడంలో తప్పు ఏం కనబడుతోంది?. ఇదే రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేల మీద తన పత్రికలో గతంలో ఏం రాశాడు? వాళ్లంతా ప్రజలకు దూరం అవుతున్నారనే కదా రాసింది.. మరి అలాంటి ఎమ్మెల్యేలకు జగన్ ఎందుకు టికెట్లు ఇవ్వాలి? వారి వైపు రాధాకృష్ణ ఎందుకు వకాల్తా తప్పించుకోవాలి? అంటే రాధాకృష్ణ రాసిన రాతల మీదనే ఆయనకు నమ్మకం లేదా? మరి ఇదేం జర్నలిజం? పైగా దీనికి దమ్ము అనే పేరు.. అన్నట్టు ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డబ్బున్న వారే రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంతమంది ఇందుకు మినహాయింపుగా ఉన్నారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పలు అంతర్గత సంభాషణల్లో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా అలాంటిదే చేస్తున్నారు కాబోలు. కానీ ఇది రాధాకృష్ణకు చంద్రబాబు విషయంలో గొప్ప లాగా.. జగన్ విషయంలో తప్పులాగా కనిపిస్తోంది.. అన్నట్టు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి జనం మధ్యలోకి వచ్చారు. నిరసనలు చేపట్టారు.. మరి చంద్రబాబు రాజకీయాల్లో భువనేశ్వరి జోక్యం చేసుకున్నప్పుడు.. జగన్ టికెట్ల కేటాయింపు జరుగుతున్నప్పుడు భారతి ఎందుకు జోక్యం చేసుకోకూడదు? తన భర్త మళ్లీ అధికారంలోకి రావాలి అని ఎందుకు కోరుకోకూడదు? చివరికి ఇది కూడా రాధాకృష్ణకు తప్పులాగే కనిపిస్తోంది..పాపం ఆర్కే ఎలాంటి వ్యాసాలు రాసేవాడు.. ఎలా అయిపోయాడు?!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Special article on rk kotha paluku
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com