Visakhapatnam Capital: కాలం కరిగిపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. తలపెట్టిన మూడు రాజధానుల ముచ్చట కొలిక్కి రావడం లేదు. కోర్టులో విచారణ జాప్యం జరుగుతోంది. మరోవైపు రాజకీయ ప్రతికూలాంశాలు చుట్టుముడుతున్నాయి. ఎదురుగా ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీనిని ఎలా అధిగమించాలో తెలియక జగన్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. మార్చి, ఏప్రిల్ లో ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. పైగా రాజధాని లేని రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ఏపీ మసకబారింది. ఎదో ఒకటి చేయకపోతే అసలుకే ఎసరు వస్తుందని భావిస్తున్న జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు.దానికి ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. కనీసం సీఎం క్యాంపు ఆఫీసునైనా విశాఖకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం గోప్యంగా తన పని తాను చేస్తున్నట్టు సమాచారం.

వాస్తవానికి జనవరి 31న అమరావతి రాజధాని విషయంలో సుప్రిం కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని జగన్ సర్కారు భావించింది. విశాఖకు రాజధాని తరలింపుపై ధైర్యంగా ముందడుగు వేయవచ్చని అంచనా వేసింది. కానీ కథ అడ్డం తిరిగింది. సుప్రిం కోర్టు మూడు వారాల పాటు వాయిదాను పొడిగించింది. దీంతో ఏదో ఒకటి చేసి విశాఖకు రాజధాని తరలించామని అర్ధం వచ్చేలా చేయాలని భావిస్తోంది. ముందుగా సీఎం క్యాంప్ ఆఫీసు తరలించి తమ మాటను కొంతవరకూ నెగ్గే ప్రయత్నం చేసుకోవాలని చూస్తోంది. మార్చి మూడో వారం సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభమయ్యేలా చూసుకోవాలని గడువు నిర్ధేశించుకున్నట్టు తెలుస్తోంది.
గత వారం ఢిల్లీలో ఇన్వెస్టర్ల సమావేశంలో జగన్ కొన్ని విషయాలపై స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నట్టు లీకులిచ్చారు. అయితే గత కొన్నాళ్లుగా ఇదే మాట చెబుతుండడంతో అంతా లైట్ తీసుకున్నారు. కానీ అప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారులు సీఎం క్యాంప్ ఆఫీసు ఎక్కడైతే బాగుంటుందోనని అన్వేషణ ప్రారంభించారని తెలుస్తోంది. ముందుగా రిషికొండపై నిర్మిస్తున్న పర్యాటక ప్రాజెక్టుల్లో ఒక భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుకు కేటాయించాలని నిర్థారణకు వచ్చారు. కానీ అది మార్చి మూడో వారానికి సిద్ధమవ్వడం కష్టమని భావించి నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ప్రస్తుతానికి తాత్కాలిక భవనాలనైనా సిద్ధం చేయాలని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రిషికొండ, ఐటీ హిల్స్, మధురవాడ, కొమ్మాదిలో ఒక భవనాన్ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అటు బీచ్ రోడ్ లోని కొన్ని భవనాలను సైతం చూశారు. అటు ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వైస్ చాన్స్ లర్, రిజిస్ట్రార్ బంగ్లాలను సైతం ఒక ఆప్షన్ పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ భవనాల స్థితిగతులు, రవాణా, భద్రత వంటి అంశాలను అత్యంత గోప్యతగా పరిశీలిస్తున్నట్టు విశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఏదో చేయకపోతే ప్రజల్లో చులకన అవుతామని భావిస్తున్న జగన్ సర్కారు సీఎం క్యాంప్ ఆఫీసును ఎట్టి పరిస్థితుల్లో మార్చి మూడో వారానికి సిద్ధం చేయాలన్న కృతనిశ్చయంతో అయితే ఉంది.