KCR- Maharashtra: శ్రీరామ్ సాగర్ నీళ్లను ఎత్తిపోసుకోండి.. బాబ్లీ ప్రాజెక్టు పెద్ద ఇష్యూ కాదు. తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్టు చేపడితే మీరు సపోర్ట్ ఇచ్చారు. దీనిని తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ అంటేనే త్యాగానికి మారుపేరు. సేవా నిరతికి పర్యాయపదం.. తెలంగాణ ఇప్పుడు భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.. ఆఫ్ట్రాల్ గోదావరి జలాలు ఎంత.. నాందేడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన తీరు. సరే ఇప్పుడు అతడు స్టేట్స్ మెన్ కావాలి అని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న వ్యక్తి.. ఒకప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం నినదించిన వ్యక్తి.. ఇప్పుడు యాదృచ్ఛికంగా తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రయోజనాలనే బలి పెడుతున్నాడు.

సపోజ్, రేప్పొద్దున ఆంధ్రప్రదేశ్లోనూ నాందేడ్ సభ లాంటిది పెడతాడు. మరి ఏపీలోనూ బీఆర్ఎస్ కు ఓట్లు కావాలి కాబట్టి… వాళ్ళ ఆదరణ కావాలి.. సో, పోతిరెడ్డిపాడు ఏముందయ్యా? చిన్న ఇష్యూ… తీసుకుపొండి, మీకు ఇష్టం వచ్చిన నీళ్లను పారించుకోండి అంటాడా? పోలవరం ఎంత ఎత్తుకైనా కట్టేసుకోండి, పెద్ద మనసుతో చెబుతున్నాను అంటాడా? భద్రాచలం రామాలయం మునిగిన పర్వాలేదు, నేను హామీ ఇస్తున్న అంటాడా? తెలంగాణ ప్రయోజనాలకు అది విఘాతం కాదా? ఇలా తనకోసం త్యాగాలు చేయించుకునేందుకేనా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేసింది? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది?

అక్కడిదాకా ఎందుకు? కర్ణాటక సరిహద్దులో కూడా ఓ మీటింగ్ పెడతాడు.. తుంగభద్ర ఆర్డీఎస్ చాలా చిన్న ఇష్యూస్, అప్పర్ కృష్ణా రెండు డ్యాములే కాదు, ఆలమట్టి ఎత్తు ఎంతైనా పెంచుకోండి అంటాడా? నాందేడ్ సభ, ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడిన తర్వాత ఇలాంటి సీన్స్ రిపీట్ చేస్తాడేమో అని డౌట్ గా ఉంది. కర్ణాటక అక్రమంగా కట్టుకునే ప్రాజెక్టులకు కెసిఆర్ అనుమతి ఇస్తాడా? అలాంటప్పుడు తెలంగాణ ప్రయోజనాల మాటేమిటి? పెద్ద మనసు సరే, తెలంగాణకు వచ్చిన ఫాయిదా ఏమిటి? కెసిఆర్ రాజకీయ అవసరాలను బట్టి రాష్ట్ర ప్రయోజనాలు, విధానాలు మారిపోవాలా? ఇదెక్కడి ధోరణి? ఇంతటి భారీ ఔదార్యం చూపించే కెసిఆర్, పెద్ద మనసు ప్రదర్శించే కెసిఆర్.. మిగతా వారి మీద ఎందుకు అంత అక్కసు ప్రదర్శిస్తారో తెలియదు.