
Singareni Mines Auction Controversy: తెలంగాణకు ప్రధానమంత్రి మోదీ వచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రధాని వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేయడం భారత రాష్ట్ర సమితి అలవాటుగా మార్చుకుంది. ఈసారి సింగరేణి బొగ్గు గనుల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ భారత రాష్ట్ర సమితి ప్రధానంగా ఆరోపిస్తోంది సింగరేణి బొగ్గు గనుల వేలం గురించి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు కలలు కూడా ఉన్నాయి.. అవి భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం ఓసి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని జేవిఆర్ ఓసీ_3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్ పల్లి, కళ్యాణ్ ఖని_3 లను వేలానికి పెట్టింది. వీటి పరిధిలో 430 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. సింగరేణి సంస్థ వీటిపై అధ్యయనానికి కొన్ని కోట్లు ఖర్చు చేసింది. ఒక్క ఎక్స్ప్లోరేషన్ విభాగానికే 66 కోట్లు ఖర్చు చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై భగ్గుమంటున్నది.
మరోవైపు దీనిపై కేంద్రం కూడా అదే స్థాయిలో వివరణ ఇస్తున్నది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలు ఏవైనా సరే టెండర్లు దాఖలు చేసి వేలంలో బొగ్గు గనులు సొంతం చేసుకోవాలని స్పష్టం చేస్తోంది.. కేవలం తెలంగాణలోని నాలుగు బ్లాకులు మాత్రమే కాదు.. దేశంలోని 101 బొగ్గు గనులను ఇదే తీరుగా వేలం వేస్తున్నట్టు కేంద్రం ప్రకటిస్తోంది.. అంతేకాదు ఈ వేలానికి సంబంధించి గత నెల 29వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ గనులపై ఈనెల 12వ తేదీన ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామని ఆసక్తి గల ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలు హాజరై టెండర్ ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా మరో నోటిఫికేషన్ ఇచ్చింది.

అయితే కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానంపై రాష్ట్ర ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి టెండర్లు వేయొద్దని అనుకుంటున్నది. నేరుగా కేంద్రం గనులు కేటాయించే దాకా పోరాడతామని చెబుతోంది.. దీంతో ఇతర ప్రైవేట్ కంపెనీలో తెలంగాణలోని ఘనల కోసం టెండర్లు దాఖలు చేస్తే వాటికే కేటాయించడానికి కేంద్రం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు గనుల వేలానికి సంబంధించి గత ఏడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం 16వ విడత టెండర్ ప్రకటన జారీ చేసింది. అప్పుడు తెలంగాణలోని మొత్తం నాలుగు గనులను వేలంలో పెట్టగా.. సత్తుపల్లి బ్లాక్ 3 గనికి మాత్రమే ఒక టెండర్ దాఖలయింది.. వీటితోపాటుగా దేశంలోని మరో అయిదు గనులకు కూడా ఒకే టెండర్ చొప్పున రావడంతో ఈ ఆరింటినీ ఎవరికీ కేటాయించకుండా పెండింగ్లో ఉంచింది. ఇక తెలంగాణలోని శ్రావణ్ పల్లి, కళ్యాణ ఖని _ బ్లాక్_6, పెనగడప గనులకు సంబంధించి టెండర్ వేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఏవీ గత నవంబర్ లో ముందుకు రాలేదు.. తాజాగా గత నెల 29వ తేదీన జారీ చేసిన 17వ విడత దేశవ్యాప్త గనుల వేలంలో ఈ గనులను మళ్లీ గనుల శాఖ చేర్చింది.
గత ఏడాది కాలంలో రెండు సార్లు వేలంలో పెట్టినప్పటికీ…ఎవరూ ముందుకు రాకపోవడంతో వీటిని తమకే కేటాయిస్తారని ఎదురుచూస్తున్న సింగరేణి సంస్థకు తాజా నటిఫికేషన్ తీవ్ర నిరాశ కలిగించింది. పెనగడపగనిలో బొగ్గు తప్పక లాభదాయకం కాదని దీనిని సింగరేణి సంస్థే గతంలోనే కేంద్ర బొగ్గు శాఖకు తిరిగి అప్పగించింది.. ఇది కాకుండా మిగతా మూడింటిని, గతంలో ఓ ప్రైవేట్ కంపెనీకి కేటాయించిన కోయగూడెం బొగ్గు గనిని కూడా తమకే ఇవ్వాలని సింగరేణి కోరుతోంది. ఇక కోయగూడెం గనికి గత ఏడాది వేలంలో తెలంగాణకు చెందిన “ఆర” అనే కోల్ కంపెనీ టెండర్ వేసి అర్హత సాధించింది. దానిని తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తిరిగి తమకే వస్తుందని సింగరేణి సంస్థ భావిస్తోంది. అయితే వేలంలో ఎవరైనా ఫీజు చెల్లించి పాల్గొనాలని కేంద్రం అంటోంది. తెలంగాణ మాత్రం నేరుగా గనులు కేటాయించాలని కోరుతోంది. కానీ ఈ పంచాయితీ ఇప్పుడు పరిష్కారం అవుతుందో అంతు పట్టకుండా ఉంది.