Vedha Trailer Review: డార్క్ విలేజ్ డ్రామాలు సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తున్నాయి. కల్ట్ మాస్ సబ్జెక్స్ కి పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ జతచేసి వెండితెర మీద అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. కన్నడ చిత్రం కాంతార ఎంత పెద్ద సెన్సేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. కాంతార లాంటి కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. మరో కన్నడ చిత్రం వేద అదే తరహాలో తెరకెక్కింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన వేద చిత్రంలో కాంతార ఛాయలు కనిపిస్తున్నాయి.

వేద చిత్ర ట్రైలర్ ని మెగా హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒణుకు పుట్టించింది. విలేజ్ యాక్షన్ డ్రామాగా వేద తెరకెక్కింది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగించేవిగా ఉన్నాయి. 1960ల నాటి కథగా దర్శకుడు ఏ.హర్ష తెరకెక్కించారు. వేద గా శివరాజ్ కుమార్ సిల్వర్ స్క్రీన్ పై రక్తపుటేరులు పారించారు. యాక్షన్, ఎమోషన్ అంశాలు కలగలిపి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారు.
విశేషం ఏమిటంటే హీరోకి సమానంగా హీరోయిన్ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొనడం. హీరోయిన్ గానవి లక్ష్మణ్ తనలోని యాక్షన్ యాంగిల్ పీక్స్ లో చూపించింది. ఆమె చూపుల్లో కోపం, క్రూరత్వం భయపెట్టేవిగా ఉన్నాయి. హీరో అండ్ హీరోయిన్ సీరియస్ ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నారు. ట్రైలర్ గమనిస్తే ఇది విలేజ్ రివేంజ్ డ్రామా అనిపిస్తుంది. తన కుటుంబాన్ని డిస్టర్బ్ చేసిన వారిపై భార్యాభర్తలు ఎలా పగ తీర్చుకున్నారు అనేది ప్రధాన అంశం కావచ్చు.

మొత్తంగా చెప్పాలంటే ప్రేక్షకులను ఆకట్టుకునే మరో కన్నడ మూవీ అవుతుందనిపిస్తుంది. గత ఏడాది శాండిల్ వుడ్ సినిమాలు టాలీవుడ్ ని ఊపేశాయి. కెజిఎఫ్ 2, విక్రాంత్ రోణా, చార్లీ 777, కాంతార గొప్ప విజయాలు నమోదు చేశాయి. కన్నడ చిత్రాలపై తెలుగులో ఆదరణ పెరుగుతుంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా… వేదం మంచి విజయం నమోదు చేయడం ఖాయం. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. శివరాజ్ కుమార్ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్యన్న విషయం తెలిసిందే.
