Justice Chandru: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు మధ్య వార్ ఇప్పటిది కాదు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఒక రూపంలో వివాదాలు ముసురుకున్నాయి. జగన్ సర్కార్ విధానాలకు హైకోర్టు బ్రేకులు వేయడం.. దీనిపై ఏపీ మంత్రులు, జగన్ ఏకంగా అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తమ ప్రభుత్వంపై హైకోర్టు పక్షపాతం చూపిస్తోందని జగన్ సర్కార్ ఆరోపించింది. ఇక సోషల్ మీడియాలోనూ వైసీపీ సానుభూతిపరులు హైకోర్టు తీర్పుపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వారిపై హైకోర్టు ఆగ్రహించి సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఈ ఫైట్ యమ రంజుగా సాగుతున్న వేళ ‘జైభీమ్’ ఫేం.. అసహాయుల పాలిట వాదించిన గొప్ప మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. చంద్రు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయవ్యవస్థకు కూడా పరిమితులు ఉంటాయని జస్టిస్ కే. చంద్రు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్(ఏపీసీఎల్ఏ), కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రబాబు ఏపీ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. ఇప్పుడివి ఏపీ లోని జగన్ సర్కార్ కు ఆయుధంగా మారాయి. హైకోర్టు తీరుపై నిజంగా ప్రశ్నలు మొదలయ్యాయి.
జస్టిస్ చంద్రు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటీషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చని అభిప్రాయపడ్డారు. అంతకు మించి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని.. మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించడం.. నిందితులను పట్టుకోవడానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపండం వంటి చర్యలను తప్పుపట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణ ముఖ్యమన్నారు.
మూడు రాజధానుల విషయంలో అమరావతిలో భూములున్న న్యాయమూర్తులు హైకోర్టులో ఉన్నందున వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిందని..కానీ హైకోర్టు ‘మేమే విచారిస్తాం’ అని ఎలా చెబుతారని జస్టిస్ చంద్రు ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న న్యాయవ్యవస్థలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.