UK PM Race: 200 ఏళ్ల పాటు మనల్ని నిరంకుశంగా పాలించిన బ్రిటీష్ వారిని మనమే ఏలే అరుదైన అవకాశం మనకు దక్కింది. భారత సంతతికి చెందిన రిషి సునక్ ఇప్పుడు ప్రధాని రేసులో తొలి అడ్డంకిలో ప్రథమ స్థానంలో నిలిచి తదుపరి పోటీకి రెడీ అయ్యారు. బ్రిటన్ ప్రధాని పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఇందులో కన్జర్వేటివ్ పార్టీ తరుపున భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన భారతీయుడుగానే కాకుండా ఇండియాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి అల్లుడు కూడా కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది.. అయితే రిషి సునక్ ప్రధాని కావడానికి సొంత పార్టీ నుంచి 20 మంది ఎంపీల మద్దతుతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా సపోర్టు ఉండాలి. రిషి సునక్ ఇప్పటికే ఆర్థిక మంత్రిగా బ్రిటన్ ప్రజలకు సుపరిచితుడు. అంతేకాకుండా కొవిడ్ సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయని అంటున్నారు. అయితే రిషి సనక్ కు బోరిస్ జాన్సన్ వర్గానికి చెందిన మద్దతుదారులు మద్దతు ఇస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. తొలి కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి సునక్ తోపాటు కొంతమంది పోటీపడగా.. అందులో అందరికంటే ఎక్కువగా 88 ఓట్లు సాధించి తదుపరి పోరుకు రిషి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ అవుతారా? ఆయన ముందున్న అడ్డంకులపై స్పెషల్ స్టోరీ..

-బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది రిషి సునక్ నే?
బోరిస్ జాన్సన్ వర్గంలో రిషి సునక్ గతంలో ఒక సభ్యుడే. బోరిస్ కు రిషి అత్యంత సన్నిహితుడని పేరుంది. అందుకే ఆయనకు ఆర్థిక మంత్రిగా చేశాడని అంటారు. దీంతో బోరిస్ వర్గం ఎలాగూ రిషికే మద్దతు ఇస్తుందని అంటున్నారు. కానీ ఇదే సమయంలో మరో చర్చకు దారి తీస్తుంది. బోరిస్ పాలన వద్దని 40 మంది మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో మొదటి వ్యక్తే రిషి సునక్. సునక్ రాజీనామా తరువాత మిగతా వారు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారనే పేరు కూడా వచ్చింది. దీంతో బోరిస్ అసలు తనను పడగొట్టిన రిషికి మద్దతిస్తారా? లేక ఓడిస్తాడా? ఆయన వర్గం ఎటువైపు ఉంటారనేది ఆసక్తిగా మారింది.
-రిషి సునాక్ ప్రచారం పీఠం కట్టబెడుతుందా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగల సమర్థత రిషికి ఉందని పార్టీ నమ్ముతోంది. అందరూ పన్ను రాయితీ ఇస్తామని ప్రకటిస్తే.. రిషి మాత్రం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని అంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రిషి సునక్ ఒక రకంగా ఇదే ప్లస్ గా మారింది. కానీ కన్జర్వేటివ్ పార్టీ నాయకులు మరో రకంగా చెబుతున్నారు. కన్జర్వేటివ్ నుంచి పోటీకి సిద్ధమయ్యే వారు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే పన్నుల రాయితీ తప్పనిసరి అని.. మా ప్రభుత్వం ఆ పనిచేస్తామని ప్రచారం చేస్తున్నారు.. కానీ రిషి మాత్రం అందుకు సిద్దంగా లేనట్లుగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అంటే ముందు దేశాన్ని ఎకానమీగా వృద్ధి చేయాలని, ఆ తరువాతే పన్నుల రాయితీ అనడంతో రిషి వైపు కొందరు వ్యతిరేకిస్తున్నారు. అంతకంటే ముందు పన్నుల రాయితీ సాధ్యం కాదని, అలా చేస్తే మరింత ఆర్థిక లోటు ఏర్పుడుతుందని రిషి అంటున్నాడు. పన్నుల రాయితీ కోసం చూసే వారికి రిషి ప్రచారం మింగుడు పడడం లేదు.
-అపర ధనవంతుడని రిషిపై నెగెటివ్ ప్రచారం?
బ్రిటన్ రాజకీయాల్లో రిషి సునక్ బాగా ధనవంతుడనే ప్రచారం ఉంది. ఆయన సతీమణి ఇన్ఫోసిన్ ఫ్యామిలీ నుంచి వచ్చినందున ఆమెకు బోలెడంత ఆస్తి ఉంది. ఇన్ఫోసిస్ లో వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. దీంతో ఈమె బ్రిటన్ రాజకుమారి కంటే కూడా ధనికురాలని, ఆమెతో పాటు రిషి కూడా హై రిచ్ మ్యాన్ అనే పేరు ప్రచారమవుతోంది. అయితే అభివృద్ధి చెందిన బ్రిటన్ దేశంలో ఇలా ధనవంతుడు అనే వాదన బలంగా పాతుకుపోతుందా..? అనే ప్రశ్న ఎదురవుతోంది. కానీ కొవిడ్ తరువాత బ్రిటిష్ సగటు పౌరుడి ఆర్థికలోటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో రిచ్ అనే పదం ప్రజలకు దూరంగా మారినట్లయింది. అయితే ప్రధాని కావడానికి రిషికి ఎంపీల మద్దతు అవసరం ఉంది. ఎంపీలతో పాటు పార్టీలోని లక్షా 80వేల మంది క్రీయాశీలక సభ్యుల ఓట్లు అవసరం ఉంటుంది. దీంతో ప్రత్యర్థులు రిషి చాలా రిచ్ అని, ఆయన సతీమణి పన్నులు ఎగవేతకు పాల్పడ్డారని విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ విషయంలో పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు.
-జాత్యహంకార ప్రచారంలో రిషి గెలుస్తాడా?
ఇక బ్రిటన్లో గత పదేళ్లలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బోరిస్ వర్గంలో చాలా మంది ఇతర దేశస్థులు ఎంపీలయ్యారు. ఓ ముస్లిం వ్యక్తి కూడా మేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఇండియన్స్ పార్లమెంట్ లో వివిధ హోదాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి మద్దుతు ఇస్తారా..? అనే వాదన పుట్టుకొచ్చింది. విద్వేష రాజకీయాలు సాగితే బ్రిటన్ కు వేరే దేశ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోరు. బ్రిటన్ వాసులనే ఎన్నుకుంటారు. ఆ దేశంలో ఎవరైనా సరే.. వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి గెలిపిస్తారని కూడా అంటున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ బ్రిటన్ కు ప్రధానినా? సిగ్గుచేటు’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. రిషి సునక్ కు ఎంపీల మద్దతు ఉందని అంటున్నారు. అయితే ప్రధానిగా ఎన్నిక కావడానికి పార్టీ క్రియాశీల సభ్యులే కీలకం. దీంతో చివరి నిమిషం వరకూ రిషి గెలుపు అన్నది కష్టసాధ్యమే.. ఎంపీల మద్దతుతో పాటు కన్జర్వేటివ్ లోని క్రీయాశీలక సభ్యుల మద్దతు ఇస్తేనే రిషి గెలుస్తాడు. కానీ ఇటీవల నిర్వహించిన ఓపినీయన్ పోల్ లో క్రీయాశీలక సభ్యుల మద్దతు రిషికి లేదన్నది తేలింది. దీంతో చివరి వరకు బ్రిటన్ ప్రధానిగా మన భారతీయుడు అవుతాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది.