Rajinikanth- Chandrababu: కాలం గడుస్తున్నా కొద్దీ పాత విషయాలు మరుగున పడతాయి. కానీ ఒక్కో సారి చరిత్రను తవ్వితే అసలు వాస్తవాలు కళ్ళకు కడతాయి. అప్పుడు మన చుట్టూ ఉన్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళూ మనం ఆరాధించిన వ్యక్తుల అసలు కోణాలు మనకు తెలిసిపోతాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే…అది అంతటి విషయం కాబట్టి, శిఖరం అంతటి వ్యక్తిపై విషం చల్లారు కాబట్టి.. మహోన్నత నటుడు పై చెప్పులు వేశారు కాబట్టి… ఇవ్వాళ వారే ఆ నట సార్వభౌముడి విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు కాబట్టి.
నాటి ఘటనలో..
తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు, కచ్చితంగా ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఎన్టీఆర్ తో పాటే నాటి వైస్రాయ్ హోటల్ ఘటన కూడా గుర్తుకు వస్తుంది.. అంతేకాదు అల్లుడు దశమగ్రహం అనే సామెత కూడా మన మెదడు పొరల నుంచి బయటకు తన్నుకు వస్తుంది.. తెర వెనుక కారణాలు ఏమున్నప్పటికీ.. తెరపైన కనిపించింది మాత్రం ఒక్కటే ఒక్కటి అదే ” వెన్ను పోటు”. కొడుకులు మొత్తం మౌనసాక్షులుగా మిగిలిన వేళ, కూతుర్లు మొత్తం ఏమీ పట్టించుకోని వేళ.. ఆయన స్థాపించిన పార్టీ ఇంకొకరి చేతుల్లోకి వెళ్లిపోయింది. తన చేతుల మీదుగా బీ ఫారాలు అందుకున్న వారు ఆయన మీదే చెప్పులు వేశారు. నానా మాటలు అన్నారు.. నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఈ వ్యవహారంతో పెద్దాయన మనసు కలత చెందింది. ఆయన చేతుల్లో నుంచి పార్టీ వెళ్ళిపోయింది.
నాడు వైస్రాయ్ లో సంఘీభావం
ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ ను ఎవరైతే పొగుడుతున్నారో.. వారే ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గోతులు తవ్వారు. ఇందుకు వైస్రాయ్ హోటల్ వేదికైంది. చంద్రబాబు కట్టిన ఆ కూటమిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నటుడు మోహన్ బాబు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి వారు ఉన్నారు. ఆ కూటమికి నాటి తమిళ నటుడు రజినీకాంత్ మద్రాసు నుంచి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపాడు. చంద్రబాబుకు రజినీకాంత్ ను పరిచయం చేసింది మోహన్ బాబు..ఇక ఆ పరిచయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకున్నాడు. నాడు రజనీకాంత్ సంఘీభావం చెప్పడంతో సీనియర్ ఎన్టీఆర్ మనసు తీవ్రంగా కలత చెందింది అని ఆయన చుట్టు పక్కల ఉండే వాళ్ళు అంటూ ఉండే వారు.
మళ్లీ ఆయనే దిక్కయ్యారు
ఏరోజునయితే సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారో.. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టారో.. ఆ వ్యక్తులే నేడు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు..నాడు వైస్రాయ్ హోటల్ లో మీటింగ్ పెట్టిన వాళ్ళే ( ఇందులో కొందరు లేరు) నేడు విజయవాడ అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తున్నారు..నాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు కట్టిన కూటమికి సంఘీభావం తెలిపిన రజనీకాంత్..నేడు అదే ఎన్టీఆర్ కు నివాళి అర్పించడం యాదృచ్చికమే. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు వన్ అండ్ ఓన్లీ అయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తే తప్పా గెలిచే పరిస్థితి లేదు. అందుకే 23 దగ్గరే ఆగిపోయిన ఆ పార్టీకి కొత్త జవసత్వాలు కావాలి. అందుకే నాడు తనకు వైస్రాయ్ హోటల్ లో సంఘీభావం తెలిపిన బ్యాచ్ ను మళ్లీ పిలిపించుకున్నాడు..తనకు లేని భుజకీర్తులు తొడిగించుకున్నాడు. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏమీ లేదు. నాడు రజనీ బేగంపేట విమానాశ్రయానికి వస్తే బాలకృష్ణ రిసీవ్ చేసుకున్నాడు..ఇప్పుడు కూడా అదే బాలకృష్ణ గన్నవరం వెళ్ళి తీసుకొచ్చాడు. విమానాశ్రయాలు మాత్రమే మారాయి. పార్టీపై బాబు పెత్తనం అలాగే ఉంది. కట్టప్పలు మాత్రం అలాగే ఉన్నారు. ఉంటారు కూడా..