IPL 2023 – RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఫేవరెట్ టీమ్ గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. ముంబై జట్టు హైదరాబాద్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ జట్టు లీగ్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఆటగాళ్లంతా అద్భుత ఫామ్ లో ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది ఈ జట్టుకు. వెరసి ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
ఈ ఏడాది ఫేవరెట్ జట్లలో ఒకటి రాజస్థాన్ రాయల్స్. జట్టు నిండా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకి కొదవేలేదు. మొదట్లో ఈ జట్టు అదే స్థాయిలో ప్రదర్శన ఇచ్చింది. దీంతో గత ఏడాది రన్నరప్ గా నిలిచిన ఈ జట్టు విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. అయితే, అనూహ్యరీతిలో పలు మ్యాచ్ లో అపజయాలపాలు కావడంతో ప్లే ఆఫ్ దశకు చేరకుండానే ఈ సీజన్ ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అరవీర భయంకరమైన ఆటగాళ్లు..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో మొదటి ఆటగాడి నుంచి చివరి ఆటగాడి వరకు అందరూ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించే సామర్థ్యం కలిగిన వాళ్లే. ఈ సీజన్ లో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, హెట్మైర్, సంజు శాంసన్, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ.. ఇలా జట్టులోని దాదాపు ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. అయినా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు కారణంగా హిట్ కావాల్సిన ఈ జట్టు ఫట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు బాధాకర పరిస్థితుల్లో లీగ్ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు అభిమానుల బాధ వర్ణనాతీతంగా మారింది.
రాజస్థాన్ పై వెల్లువెత్తుతున్న సానుభూతి..
రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో ఆ జట్టుపై అభిమానులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. జైస్వాల్ 14 మ్యాచ్ లో 625 పరుగులు, చాహల్ 14 మ్యాచ్ ల్లో 21 వికెట్లు సాధించిన ఘనతలను తలచుకుంటూ తృప్తి పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో సానుభూతి వెల్లువెత్తుతోంది. ఒకవేళ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ముంబై ఓడిపోయినా అవకాశాలు ఉండేవని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ పై ముంబై గెలుపుతో ఆ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 14 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరో స్థానంతో ముగించాల్సి వచ్చింది.
ప్లే ఆఫ్ కు చేరిన ఆ నాలుగు జట్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 16వ ఎడిషన్ ప్లే ఆఫ్ దశకు చేరింది. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరాయి. ఈ నెల 23న తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుండగా, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లు కోసం అభిమానులు ఆసక్తిగా ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు.