Rahul Gandhi Lok Sabha: పార్లమెంట్లో మణిపూర్ మంటలు చెలరేగాయి. లోక్సభలోకి అడుగుపెడుతూనే రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దాదాపు నెల రోజుల నుంచి మణిపూర్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. మణిపూర్ పై పార్లమెంట్లో చర్చ జరగాలని.. ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ ప్రధాని నుంచి మౌనమే సమాధానం ఎదురైంది. దీంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా ఎంచుకున్నాయి. దానిపైనే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ప్రారంభమైంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
దేశంలో మణిపూర్ ను హత్య చేశారంటూ ఒకే ఒక విమర్శ ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టారు. అక్కడ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. నేను మణిపూర్ వెళ్ళాను.. మరి ప్రధాని వెళ్లారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు మోదీ మదిలో మణిపూర్ అనే రాష్ట్రం లేదంటూ ఎద్దేవా చేశారు. అక్కడి శిబిరాల్లో మణిపూర్ వాసులకు ఎదురైన కష్టాలను పార్లమెంట్లో పంచుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాహుల్ గాంధీ ఆవేశంగా మాట్లాడారు. మణిపూర్ ను హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు.
రాహుల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విమర్శల జడివానతో నిప్పులు చెరిగారు.
‘సైన్యం ఒక్కరోజులో మణిపూర్ లో శాంతిని నెలకొల్పగలదు. అయినా సరే ఆ ప్రయత్నం చేయడం లేదు. అసలు ప్రధాని దేశం గుండెచప్పుడు వినడం లేదు. ఆయన ఇద్దరి మాటలనే వింటారు. ఒకరు అదాని అయితే.. రెండోది అమిత్ షా. ఇది రావణాసురుడు.. మేఘనాథుడు.. కుంభకర్ణుడి మాట వినే తరహా. లంకా రాజ్యాన్ని రావణుడి అహంకారమే దహించేసింది. ఇప్పుడు దేశంలో మీరు కిరోసిన్ అనే విద్వేషం చీమ్ముతున్నారు . మొన్న మణిపూర్,నేడు హర్యానా’ అంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.