Rahul Gandhi Jodo Yatra: ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు శ్రీకారం చుడుతున్నారు. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ 3,500 కిలోమీటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటకలో ముగించుకుని ఆదివారం తెలంగాణలో అడుగుపెట్టింది. ఈ యాత్రపై తెలంగాణ కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది.
క్విట్ ఇండియా ఉద్యమమే స్ఫూర్తిగా…
ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ఈ యాత్ర ద్వారా ప్రత్యామ్నాయం చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రై వేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ రాహుల్ యాత్ర సాగుతోంది.
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం చూపుతుందని..
తెలంగాణలో రాహుల్ పాదయాత్రతో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రయత్యామ్నాయం కాంగ్రెస్సే అనే భావన ప్రజల్లోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈమేరకు రాహుల్ యాత్రను విజయవంతం చేసేలా భారీగా జన సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్నా.. ఆ ఎన్నికల కన్నా.. రాహుల్ యాత్రకే సీనియర్ నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న ప్రచారం జరుగుతోంది. భారత్ జోడో యాత్రతో ఈ ప్రచారానికి చెక్‌పెట్టాని టీ కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో బలం పుంజుకోవడం ద్వారా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటవచ్చని పేర్కొంటున్నారు.
ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పుడు కాదని..
తెలంగాణ ఇచ్చి పార్టీగా రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. అయితే దానిని ఎన్నికల వేళ బలంగా ఓటర్లకు వినిపించడంలో ఆ పార్టీ నేతలు విఫలమవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రచారం ముందు.. కాంగ్రెస్ నేతల ప్రచారం చిన్నబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక తెలంగాణ ప్రభావం పెద్దగా ఉండదన్న భావన టీఆర్‌ఎస్ నేతల్లోనే కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ కూడా తెలంగాణ మంత్రంతోపాటు అభివృద్ధి, రైతు, నిరుద్యోగ ఎజెండాతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దీనికి రాహుల్ జోడో యాత్రను జత చేయడం ద్వారా ప్రజలకు స్పష్టమైన సంకేతం పంపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రాలేమన్న భావన టీకాంగ్రెస్ నేతల్లో ఉంది. అందుకే రాహుల్ యాత్రకు ఆ పార్టీ అంత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
నేతల్లో ఐక్యత.. రాహుల్‌కు అగ్నిపరీక్ష..
తెలంగాణ కాంగ్రెస్ అంటేనే కయ్యాలకు నిలయం.. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. మునుగోడు ఉప ఎన్నికల వేళ.. రాహుల్ యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తున్న సందర్భంలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలన సమన్వయం చేసుకుంటూ తెలంగాణలో భారత్ జోడో సాగించడం.. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న మెసేజ్ ప్రజల్లో తీసుకురావడం రాహుల్ గాంధీకి ఓ అగ్నిపరీక్షే. టీ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఇప్పటికే ఢిల్లీలో రెండు పర్యాయాలు సీనియర్లతో అధిష్టానం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వెళ్లొచ్చిన కొన్ని రోజులు ఐక్యతారాగం వల్లిస్తున్న నేతలు తర్వాత తమకు అలవాటైన గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే కయ్యాలకు కాలుదువ్వుతున్నారు. గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణలో యాత్ర ద్వారా ముందుగా పార్టీ నేతల మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ కొంతమంది సీనియర్లు తనను ఒంటరిని చేయాలని చూస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడులో కాంగ్రెస్‌కు కాకుండా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, తదితరులు టీపీసీసీ చీఫ్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో పాదయాత్ర చేసే రాహుల్.. తెలంగాణ కాంగ్రెస్‌జోడోకు ప్రయత్నించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి రాష్ట్రంలో 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర సాగే రాహుల్ యాత్ర ఆ పార్టీ నేతలను ఎలా సమన్వయం చేస్తుందో.. పార్టీని ఏమేరకు బలోపేతం చేస్తుందో చూడాలి.