Queen Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజబెత్_2 అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాల అధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత కోసం, ఇతర ఏర్పాట్ల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తున్నది. మన కరెన్సీ తో పోల్చితే దాదాపు 71 కోట్ల రూపాయలు. లండన్ లోని వెబ్ మినిస్టర్ అబే చర్చిలో రాణి అంత్యక్రియలు జరుపుతారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలకు ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతుండడంతో బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 125 థియేటర్లలో అంత్యక్రియలకు సంబంధించి ప్రత్యేక లైవ్ ను ప్రసారం చేయబోతున్నారు. రాణి రాజసానికి గుర్తుగా 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకతమణులు, 269 ముత్యాలు, నాలుగు రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని శవపేటికపై ఉంచారు. రాణి అంత్యక్రియల కోసం రెండు వేల మంది ప్రముఖులు, అతిథులు హాజరవుతున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వివిధ దేశాల నేతలు ఈ క్రతువులో పాలు పంచుకోబోతున్నారు. ప్రపంచ స్థాయి నేతలు హాజరవుతుండడంతో బ్రిటన్ ప్రభుత్వం 5,949 మంది పోలీసులను భద్రతా విధుల్లో నియమించింది. కామన్వెల్త్ దేశాల నుంచి 175 మంది సైనికులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. వెస్ట్ మినిస్టర్ అబే నుంచి వెల్లింగ్టన్ ద్వారం వరకు సాగే రాణి అంతిమయాత్రలో 1,650 మంది సైనికులు పాల్గొంటున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లో పదివేల మంది పైగా పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. లండన్ లోని మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇంత మందిని భద్రత కోసం రంగంలోకి దించడం ఇదే మొదటిసారి. రాణి పార్థివ దేహాన్ని చూసేందుకు భారీగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో లండన్ లోని 36 కిలోమీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, వెస్ట్ మినిస్టర్ అబే, బకింగ్ హమ్ ప్యాలెస్ పరిసరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా 250 రైళ్లను, ఐదు వందల బస్సులను అదనంగా నడుపుతోంది. ఇక రాణి భౌతిక దేహాన్ని ఉంచిన వెస్ట్ మినిస్టర్ హాల్ లో ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పోలీసులు అడుగడుగునా బారికెడ్లు ఏర్పాటు చేశారు.
…
రాణి తల్లి అంత్యక్రియల కోసం ₹43 కోట్ల ఖర్చు
..
2002లో క్వీన్ ఎలిజిబెత్ తల్లి మరణించినప్పుడు అంత్యక్రియల కోసం బ్రిటన్ ప్రభుత్వం ₹43 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం అది ₹127 కోట్లతో సమానం. ఇక 1997లో ప్రిన్సెస్ డయానా అంత్యక్రియల కోసం ₹40 కోట్లు ఖర్చయింది. అది ఇప్పటి రేట్ల తో పోలిస్తే ₹100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. అయితే రాణి అంత్యక్రియల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండటం పట్ల బ్రిటన్ ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్ లో ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు తారాస్థాయికి చేరడం..ఈ శీతాకాలం నాటికి 13 లక్షల మంది పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశం ఈ స్థితిలో ఉన్నప్పుడు అంత్యక్రియల కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని మేధావులు విమర్శిస్తున్నారు. అంతగా ఖర్చు చేయాలి అనుకుంటే రాజుల వ్యక్తిగత ఖాతాల్లో వందల కోట్ల డబ్బు ఉందని, దాన్ని వెచ్చించొచ్చు కదా అని చురకలు అంటిస్తున్నారు.
..
అంత్యక్రియలు ఇలా జరుగుతాయి
..
* సోమవారం ఉదయం 6:00 కల్లా రాణి పార్థివ దేహం సందర్శించేందుకు వస్తున్న వారిని నిలిపివేస్తారు .
* అనంతరం రాణి పార్థివదేహానికి తుది నివాళులు అర్పించేందుకు ప్రముఖుల రాక మొదలవుతుంది.
* ఉదయం 11 గంటలకు రాణి శవపేటిక ను వెస్ట్ మినిస్టర్ హాల్ నుంచి అధికారిక లాంచనాలతో వెస్ట్ మినిస్టర్ అబేకు తరలిస్తారు.
*ఇక్కడ పలు చర్చిలకు చెందిన పాస్టర్లు ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు చారిత్రాత్మకమైన లండన్ వీధుల మీదుగా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. అనంతరం శవపేటికను విండ్సర్ కోటకు చేరవేరుస్తారు.
* అక్కడి సెయింట్ జార్జ్ ఛాపెల్ లో గత ఏడాది మరణించిన భర్త పిలిప్ సమాధి పక్కనే రాణి భౌతిక కాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్ మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాగే ఈ కార్యక్రమం సాయంత్రానికి ముగుస్తుంది.
*తర్వాత చివరి ప్రార్థనలు చేసి రాణి కుటుంబ సభ్యులు పూలతో అంజలి ఘటిస్తారు. కొద్ది సేపు మౌనం పాటిస్తారు. కాగా రాణి మృతికి సంతాపంగా ఆదివారం బ్రిటన్ వ్యాప్తంగా ప్రజలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.