Homeజాతీయ వార్తలుT Congress Youth Declaration: టీ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్.. అధికారంలోకి తీసుకొస్తుందా..?

T Congress Youth Declaration: టీ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్.. అధికారంలోకి తీసుకొస్తుందా..?

T Congress Youth Declaration: దేశ రాజకీయాలను ఒకప్పుడు శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనగడ కోసం పాకులాడుతోంది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయించిన ఈ పార్టీ.. ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ధీనస్థితికి చేరిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంటుందని భావించినప్పటికీ.. విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సర్వశక్తులను కాంగ్రెస్ పార్టీ ఒడ్డుతోంది. తాజాగా యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రకటించింది ప్రియాంక గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందా..? అన్న చర్చ ఇప్పుడు ఆ రాష్ట్రంలో తెగ జరుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఇప్పటికే సభలు, సమావేశాలు, పాదయాత్రలు పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు ప్రధాని పార్టీల నాయకులు. తాజాగా సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ పేరుతో సభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. యువ డిక్లరేషన్ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేడిలోను సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. దీంతో సభ విజయవంతం అయిందని కేడర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇచ్చిన ప్రియాంక గాంధీ..

ఈ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఏమి మాట్లాడారంటే. ‘ తెలంగాణ.. ఇది కేవలం ఒక పటంలోని ప్రాంతం మాత్రమే కాదు. ఇక్కడ ప్రజలకు ఈ నేల అమ్మతో సమానం. రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది యువత ప్రాణత్యాగం చేశారు. అయితే అమరవీరులు ఏ ఆకాంక్షలు, లక్ష్యాల కోసం ఉద్యమంలో చేరి ప్రాణాలు అర్పించారో.. అవి నెరవేరలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత ఉద్యమించారు. యువత బలిదానాలు వల్లే తెలంగాణ సాధ్యమైంది. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైనది. ఇందుకోసం సోనియా ఎంతో మదనపడ్డారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపన సోనియాకు ఉంది. మీ ఆకాంక్షలు నెరవేరాలని ఆమె రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కానీ అలా జరగలేదు’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

యూత్ డిక్లరేషన్ లో ఏముందంటే..?

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ను ఐదు శీర్షికలుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. యువతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగానే డిక్లరేషన్ ను ప్రకటించింది. యూత్ డిక్లరేషన్ లో ఏముందంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన ఉద్యమకాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు రూ.25 వేల గౌరవ పించన్ అందించడం. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు కల్పించడం. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఏటా జూన్ 2 నాటికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు అందించడం, సెప్టెంబర్ 17న నియామక పత్రాలు ఇవ్వడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయిన యువకులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి కల్పించడం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో నియామక పరీక్షలు నిర్వహించడం, నిరుద్యోగ రైతు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం, ఏడు జోన్లుగా విభజించిన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేయడం, ప్రైవేటు పరిశ్రమంలో 75% ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగ యువకులకు ఇచ్చేలా చట్టాన్ని తీసుకురావడం, నిరుద్యోగ యువతకు అండగా యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పూర్తిస్థాయిలో చెల్లించడం, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు గా మార్చడం, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం, బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయడం, అమెరికాలో ఉండే ఐఎంజీ తరహాలో స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు చేసి క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాదులో ప్రత్యేక యూనివర్సిటీలు నిర్మించి ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం.. వంటి కీలకమైన అంశాలతో యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా..?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ నిరుద్యోగ యువతలో అసహనం పేరుకుపోయింది. ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాకపోవడంతో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కాస్త ఆశావహంగా కనిపిస్తుండడంతో.. యువత, నిరుద్యోగులు.. ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమంలో భాగస్వాములై కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి భరోసాను కల్పించేలా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో స్పష్టమైన హామీని ఇవ్వడంతో ఆయా వర్గాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రణాళికతో యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని, ఇది ఆ పార్టీకి కలిసి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version