Ugram Rifle : దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తూ.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత సైన్యానికి సరికొత్త ఆయుధాలు అందనున్నాయి. యుద్ధరంగంలో శత్రుమూలక ఆటకట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏఆర్‌డీఈ) హైదరాబాద్‌కు చెందిన ద్వీపా ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ రైఫిల్‌ను అభివృద్ధి చేసింది.
అత్యంత వేగంగా అభివృద్ధి..
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేసిన ఆయుధం ఉగ్రం కావడం విశేషం. 7.2 ఎంఎం క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే ఈ రైఫిల్ మన దేశ సాయుధ బలగాలు విరివిగా ఉపయోగించే ‘ఇన్సాస్’ రైఫిల్ కంటే ఎంతో భీకరమైంది. సైనిక, పారామిలిటరీ, పోలీసు బలగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉగ్రం రైఫిల్‌ను అభివృద్ధి చేశారు. కార్గిల్ యుద్ధం సమయం నుంచి ఉపయోగిస్తున్న ‘ఇన్సాస్’ రైఫిళ్ల స్థానంలో ఉగ్రం రైఫిళ్లను ప్రవేశపెట్టనున్నారు.
ప్రత్యేకతలివీ..
ఉగ్రం రైఫిళ్లు చాలా ప్రత్యేక కలిగి ఉన్నాయి. నాలుగు కిలోల బరువు ఉండే ‘ఉగ్రం’ రైఫిల్ 500 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. దాదాపు 5 ఫుట్‌బాల్ మైదానాలంత దూరానికి సమానం. త్వరలో ఈ రైఫిళ్లను ట్రయల్స్‌కు పంపుతామని ఏఆర్‌డీఈ డైరెక్టర్ అంకతి రాజు తెలిపారు. 7.62 ఎంఎం క్యాలిబర్ రౌండ్లను కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్ల అభివృద్ధి కోసం భారత్ ఇప్పటికే రష్యాతో కలిసి పనిచేస్తోంది. ఈ రైఫిళ్లను దేశీయంగా తయారు చేసేందుకు ఇండో – రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఐఆర్‌ఆర్‌పీఎల్) పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని కోర్వాలో ఓ జాయింట్ వెంచన్ కంపెనీ ఏర్పాటైంది. సుమారు 300 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్లు ప్రస్తుతం తయారీ, పరీక్షల దశలో ఉన్నాయి.