Rs. 500 notes : రూ.500 నోట్లు చెల్లుతాయా లేదా? అన్న దానిపై కేంద్రం సంచలన ప్రకటన

రూ.10, రూ.20, రూ.50 వంటి డినామినేషన్‌లు ఇప్పటికే స్టార్ సిరీస్ నోట్లను కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 2016లో కొత్త 500 రూపాయల నోట్లలో స్టార్ సిరీస్‌ని విడుదల చేసిందని తెలిపింది.

Written By: NARESH, Updated On : January 12, 2024 7:13 pm
Follow us on

Rs. 500 notes : ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ఎక్కువయ్యాయి. వాయు వేగంతో తప్పుడు వార్తలను సర్క్యులేట్‌ చేస్తున్నారు. నిజమో కాదో తెలుసుకోకుండానే.. చాలా మంది వాటిని షేర్‌ చేస్తున్నారు. ఫార్వార్డ్‌ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. ఏది నిజం? ఏది అబద్దం? తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అన్నట్లుగా ఫేక్‌ న్యూస్‌ తయారయ్యా. ఆ తర్వాత అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా అలాంటి ఫేక్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ రూ.500 చెల్లుబాటు కావని..
విషయం ఏమిటంటే చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు చెల్లుబాటు కావని జోరుగా ప్రచారం అవుతోంది. అలా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఆ 500 రూపాయల నోట్లలో కింది భాగాన సీరియల్ నెంబర్ మధ్యలో స్టార్ గుర్తుం ఉంటుంది. అలా స్టార్ గుర్తు ఉన్న నోట్లు ఫేక్‌ అని, అవి చెల్లుబాటు కావని, అలాంటి నోట్లు ఎవరూ తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా మంది ఇది నిజమే అని నమ్మేసి ఆందోళనకు గురవుతున్నారు.

కేంద్రం క్లారిటీ…
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్త కేంద్రం దృష్టికి వెళ్లింది. వెంటనే కేంద్రానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సంస్థ స్పందించింది. సీరియల్ నంబర్‌ మధ్యలో స్టార్‌ గర్తు ఉన్న రూ.500 నోట్లు ఫేక్‌ అనే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అబద్ధమని తేల్చింది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లలో స్టార్ గుర్తు ఉంటుందని చెప్పింది. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పింది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. నంబర్‌ మధ్యలో స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

రిజర్వ్‌ బ్యాంకు కూడా..
ఆ కరెన్సీ నోట్లు చట్టబద్ధమైనవే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నంబర్ ప్యానెల్‌లో స్టార్‌(*) గుర్తు ఉన్న బ్యాంకు నోట్ల చెల్లుబాటుపై ఇటీవల సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. స్టారగుర్తు బ్యాంక్ నోట్ నంబర్ ప్యానెల్‌లో చొప్పించారు. ఇది 100 ముక్కల సీరియల్ నంబర్ ఉన్న బ్యాంక్ నోట్ల ప్యాకెట్‌లో లోపభూయిష్టంగా ముద్రించిన బ్యాంక్ నోట్లకు బదులుగా ఉపయోగించబడుతుంది. లోపభూయిష్టంగా ముద్రించిన నోట్లకు ప్రత్యామ్నాయంగా ఆర్‌బీఐ 2006లో స్టార్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టిందని తెలిపింది. రూ.10, రూ.20, రూ.50 వంటి డినామినేషన్‌లు ఇప్పటికే స్టార్ సిరీస్ నోట్లను కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 2016లో కొత్త 500 రూపాయల నోట్లలో స్టార్ సిరీస్‌ని విడుదల చేసిందని తెలిపింది.