Prashant Kishor: ప్రశాంత్ కిశోర్.. గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీ నుంచి మొన్నటి స్టాలిన్ పార్టీ వరకూ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఇప్పటివరకూ ఎక్కువగా విజయాలు సొంతం చేసుకోవడంతో దేశంలో ఆయన పేరు మార్మోగింది. బహుశా పీకే ఎంట్రీ తరువాతే రాజకీయ పార్టీలు వ్యూహకర్తల శకం ప్రారంభమైంది. అయితే వ్యూహకర్తగా విసుగుచెందారో ఏమో.. కానీ ఇప్పుడు పీకే రాజకీయ పార్టీ నేతగా ఎదగాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో జేడీయూ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు. కొద్దిరోజుల పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ తో ట్రావెల్ చేశారు. అటు రాజకీయ పార్టీ వ్యూహకర్తగా, ఇటు జేడీయూ ఉపాధ్యక్షుడుగా కొనసాగారు. అయితే నితీష్ తో సంబంధాలు దెబ్బతినడంతో జేడీయూకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో కీలక చర్చలు జరిపారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నందున.. తన శక్తియుక్తులతో పార్టీని లీడ్ లోకి తెస్తానని సోనియా చెవిన వేశారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సంతోషపడినా.. వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి మంచి బాధ్యతలు అప్పగించాలని పీకే షరతు పెట్టాడు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం పునరాలోచనలో పడింది. అది సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో పీకే సైలెంట్ అయిపోయాడు.

ఇప్పుడు బిహార్ లో ఉన్నపలంగా పీకే పాదయాత్ర ప్రారంభించాడు. రాజకీయ అజెండాతో నేరుగా ప్రజలను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ పాదయాత్ర కంటే ముందు ఆయన సీఎం నితీష్ ను కలిశాడు. చర్చలు జరిపాడు. బీజేపీని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్ లతో నితీష్ కలవడం తరువాత పీకే జరిపిన చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమి కట్టడం వెనుక పీకే పాత్ర ఉంది. ఎప్పుడైతే నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ లను వీడి బీజేపీ చేయి అందుకున్నారో.. అప్పుడే పీకే జేడీయూకు దూరమయ్యారు. ఇప్పుడు నితీష్ బ్యాక్ స్టెప్ వేయడంతో పీకే తాజాగా చర్చలు జరిపారని అంతా భావించారు. కానీ ఇప్పుడు పీకే పాదయాత్రకు దిగుతుండడంతో జేడీయూతో పాటు మిగతా రాజకీయ పక్షాలకు మింగుడుపడడం లేదు. పాదయాత్రకు కోట్లాది రూపాయల ఖర్చవుతుందని.. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వస్తోందని జేడీయూ కార్యకర్తలు, నేతలు పీకేను ప్రశ్నించడం ప్రారంభించారు.
అయితే పీకే వ్యూహకర్తగా చేసిన రాజకీయాలు ఇప్పుడు ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. ఎందుకంటే దేశంలో అన్ని పార్టీలకు ఆయన స్ట్రాటజిస్టుగా పనిచేశారు. ప్రధాని మోదీతో జర్నీ ప్రారంభించిన పీకే అరవింద కేజ్రీవాల్, కెప్టెన్ అమరిందర్ సింగ్, మమతా బెనర్జీ, కేసీఆర్, జగన్, స్టాలిన్.. ఇలా అందరికీ పనిచేశారు. అయితే అపజయాలు కంటే విజయాలే ఆయన ఖాతాలో అధికం. ఇప్పుడు బీజేపీ ప్రభ వెలుగుతుండడం, కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోతుండడంతో ఎవరికి వారే జాతీయ స్థాయిలో రాణించాలని ప్రాంతీయ పార్టీల నేతలు నమ్ముతున్నారు. అటు నితీష్, మమతా బెనర్జీ, శరద్ పవర్, కేసీఆర్ వంటి వారు జాతీయ స్థాయిలో రాణించాలని కలలు గంటుతున్నారు. కేసీఆర్ అయితే ఏకంగా భారతీయ రాష్ట్ర సమితినే ప్రారంభించారు. అందరి లక్ష్యం బీజేపీ అయినా.. వీరంతా మాత్రం కలవలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పక్షం వరకూ ఓకే అయినా… ప్రధాన ప్రతిపక్షం వరకూ రాజకీయ అస్థిరత ఉంది. దానిని పూడ్చడానికే స్ట్రాటజిస్టు పీకే ఇప్పుడు అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తో పీకేకు మంచి సంబంధాలున్నాయి. రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి రావడానికి పీకే బృందం కూడా సహకరించింది. అయితే ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అంటూ ప్రకటన ఇచ్చారో నాటి నుంచి పీకే దూరమయ్యారు. తెలంగాణ వరకూ అయితే ఓకే కానీ.. జాతీయ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తాను పనిచేయనని చెప్పి తప్పుకున్నారు. అంటే జాతీయ రాజకీయాల్లో పీకే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో బేరసారాలకు దిగారని చెబుతున్నారు. అక్కడ వర్కవుట్ అవ్వకపోయేసరికి తిరిగి నితీష్ తో చర్చలు జరిపారు. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో ఇప్పుడు పాదయాత్రకు దిగుతున్నారు. అక్కడ ప్రజల నుంచి స్పందన వస్తే ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించాలని చూస్తున్నారు. ప్రజల నుంచి స్పందన లేకుంటే మాత్రం తిరిగి వ్యూహకర్తగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ నాయకుడిగా మారిన మరుక్షణం ఇదివరకూ సేవలందించిన పార్టీల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదురయ్యే అవకాశం మాత్రం ఉంది.