Pawan Kalyan Nani: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం చూసి వాతపెడుతున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ముదిరిపోయాడని నిన్నటి ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ వేడుక తేటతెల్లం చేసింది. నాని హీరోగా రూపొందిన ఈ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదివరకూ ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెనుదుమారమే రేపాయి. ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేశాయి. టికెట్ల రేట్ల విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూశాం. ఇప్పుడు నాని మూవీ వేదికగా పవన్ కళ్యాణ్ అదే రగిలిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం కర్రవిరగకుండా.. పాము చచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. కొందరు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడగా.. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిచారు. అయితే నాడు హీరో నాని మాత్రం ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ కు సపోర్టు చేశారు. దీంతో ఏపీ మంత్రులు నానిపై విరుచుకుపడి ఆయన రిలీజ్ అయిన సినిమాకు ఇబ్బందులు సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి.
అందుకే హీరో నాని మూవీ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ హాజరై సంగీభావం తెలిపారు. ఒక బలమైన వ్యక్తి.. బలంగా నిల్చోగల వ్యక్తి అని హీరో నానిపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రాలో టికెట్ల రేట్ల విషయంలో నాని ఒక్కరే గట్టిగా మాట్లాడడాన్ని గుర్తు చేసుకోవచ్చు. చిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరి సొత్తు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘అంటే సుందరానికి’ ఫంక్షన్ ను కూడా పవన్ కళ్యాణ్ రాజకీయానికి వాడేసుకున్నారు. జగన్ ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. సినిమా రంగంలో వివిధ పార్టీ వాళ్లు ఉండొచ్చని.. భావజాలాలు వేరై ఉండొచ్చని.. కానీ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటేనన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా చాటి చెప్పారు. సినిమాలను, రాజకీయాలను ఒక్కటిగా చూడొద్దని ఉదహరించారు. ఈ సందర్భంగా తన పక్కనే ఉండే నటుడు నరేశ్ తో తనకు రాజకీయంగా విభేదాలున్నాయని.. కానీ సినిమా పరంగా మేమంతా ఒక్కటేనని పవన్ స్ఫూర్తి చాటారు. అదే సమయంలో ఈ పరిణామం నటుడు నరేష్ కు కాస్త షాక్ ఇచ్చినట్టే అయ్యింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ లోనూ రాజకీయాలను సుతిమెత్తగా ప్రస్తావించి వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించాడు.
[…] Also Read: Pawan Kalyan Nani: నానిని పొగిడి.. జగన్ ను పరోక్షం… […]