Ponguleti Srinivas Reddy : భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు వెళ్తాయి అనేది అప్పట్లో ఆసక్తికరంగా ఉండేది. కాంగ్రెస్ వైపు వెళ్తారని కొంతమంది, లేదు లేదు బిజెపి తీర్థం పుచ్చుకుంటారని కొంతమంది ఇలా ఎవరికి తోచిన మాటలు వారు మాట్లాడారు. చివరికి కొప్పుల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ టీం కలవడం, అటు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో భేటీ కావడంతో తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చనీయాంశమైన వ్యక్తిగా మారారు. అయితే ఇవన్నీ పరిణామాలు జరుగుతుండగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంతకుముందే డేరింగ్ స్టెప్ వేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టిఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు
భారత రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ పేరు తెలంగాణ రైతు సమాఖ్య అని నామకరణం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు జోరుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో ఒక వెలుగు వెలిగిన నాయకులు మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితిలో ఇటువంటి పదవులకు నోచుకోని వారు పొంగులేటి చెంతన చేరారని, వారు ఇస్తున్న గైడ్లైన్స్ ప్రకారమే పొంగులేటి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేయడం.
పార్టీ ఏర్పాటు చేస్తూనే తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీనివాస్ రెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం లోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపి ఒక రోడ్డు మ్యాప్ రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది రెడ్డి ప్రముఖులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గత కొద్దిరోజులుగా ఖమ్మంలోని తన క్యాంప్ ఆఫీసులో వివిధ జిల్లాలకు చెందిన రెడ్డి ప్రముఖులతో భేటీ అవుతున్నారు. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం లో పనిచేసిన కొంతమంది కీలక వ్యక్తులతో సర్వే కూడా నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రమే కాకుండా పొరుగున ఉన్న నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం జనరల్ అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా రిజర్వ్ స్థానాల్లో కూడా తన పార్టీ అభ్యర్థులను నిలిపి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్థికంగా అండ
ఆర్థికంగా బలంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తన పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల ఖర్చు మొత్తం తానే భరించేందుకు ముందుకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే పొంగులేటికి విదేశాల్లో బంధువులు ఉన్నారు. వారిలో కొంతమంది ఈ ఎన్నికల ఖర్చు భరించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అందువల్లే తన పార్టీ అభ్యర్థులకు పొంగులేటి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడే, కానీ ప్రస్తుతం కెసిఆర్ తో వైరం వల్ల ఆయనకు అడ్డంకులు తప్పకపోవచ్చు. అయితే విదేశాల నుంచి వచ్చే డబ్బులను అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదు. అందుకే పొంగులేటి ఇలాంటి తెలివైన ఎత్తుగడ వేశారని” ఆయన అనుచరులు అంటున్నారు. ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తానికి రైతు పేరిట రాజకీయ పార్టీ, రెడ్డి సామాజిక వర్గం పునరేకికరణ.. పొంగులేటి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది.