CBN – BJP : దేశంలో బీజేపీకి నమ్మదగిన మిత్రులుగా చాలా పార్టీలు ఉండేవి. జనసేన, టీడీపీ, అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఆ జాబితాలో ఉండేవి. సౌత్ కు వచ్చేసరికి తెలుగుదేశం బలమైన స్నేహం ఉన్న పార్టీగా కొనసాగింది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన పార్టీగా టీడీపీ దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అదే సమయంలో జనసంఘ్ నుంచి బీజేపీగా అవతరించింది. రెండు పార్టీలు ఒకేసారి తమ ప్రస్థానాన్ని పాటించాయి. రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ ను గద్దెదించడమే. ఈ సారుప్యతతోనే ఆ రెండు పార్టీల కలయిక మంచి ఫలితాలనిచ్చాయి. రెండు పార్టీలు కలిసిన ప్రతిసారి విజయమే దక్కింది. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిస్తే ఆ స్థాయి విజయం దక్కుతుందా అంటే సమాధానం దొరకడం లేదు.
ప్రస్తుతం ఏపీలో పొత్తుల చర్చలు సాగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కలుస్తాయని ప్రచారం సాగుతోంది. తొలుత బీజేపీ ససేమిరా అన్న కర్నాటక ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. చర్చలకు సానుకూలంగా ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీ పొత్తుకు ముందుకొచ్చినా.. ఆ పార్టీ నుంచి ఓట్ల బదలాయింపు జరగదన్నది దాని సారాంశం. గత ఎన్నికలకు ముందు జరిగిన ఎపిసోడ్, గత నాలుగేళ్లుగా వైసీపీకి తెరవెనుక బీజేపీ అందించిన సాయం వంటివి రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపునకు ప్రతిబంధకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు తెలుగుదేశం కూడా తమ పార్టీ ఈ పరిస్థితికి బీజేపీయే కారణమని అనుమానిస్తూ వస్తోంది. అందుకే ఇటు నుంచి కూడా బీజేపీకి ఓట్ల బదలాయింపు జరగదన్న అనుమానం సర్వత్రా వ్యాపిస్తోంది.
ఏపీలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్న టీడీపీ.. కర్నాటకలో మాత్రం బీజేపీ ఓటమిని కోరుకుంది. అక్కడ ఓటమి ఎదురయ్యేసరికి ఇక్కడ సంబరాలు చేసుకుంది. అంతెందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి హవా చూపించాలని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినా ఆ పార్టీ నుంచి ఎదురైన ఇబ్బందులకు మించి.. బీజేపీ నుంచి టీడీపీ ఎదుర్కొంది. అందుకే బీజేపీ పతనాన్ని ఎక్కవుగా కోరుకుంటోంది. అటు బీజేపీ సైతం ఏపీలో తమ దీన పరిస్థితికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తోంది. పొత్తులతో తమ రెక్కలు కత్తిరించి ప్రజల ముందు బూచీగా చూపి బలం పెంచకుండా చేశారని ఆరోపిస్తోంది. ఇటువంటి సమయంలో పొత్తులు కుదుర్చుకోవాలని చూసినా రెండు పార్టీల మనసు కలవదు.
ఒక వేళ టీడీపీతో పొత్తు కుదిరినా బీజేపీ మాత్రం ఓట్ల బదలాయింపునకు సహకరించదు. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు చేసింది. అప్పటివరకూ తమతో ఉన్న చంద్రబాబు ఎదురుతిరిగారు. కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చారు. దీంతో చంద్రబాబును చావుదెబ్బ కొట్టాలని బీజేపీ చూసింది. ఎన్నికల్లో కంటెస్ట్ చేసినా బీజేపీకి చెందిన ఓట్లను వైసీపీకి బదలాయించింది. ఇది కూడా వైసీపీ ఏకపక్ష విజయానికి ఒక కారణం. ఈ ఎన్నికల్లో అవసరం, అనివార్యంగా మారి టీడీపీ, బీజేపీ కలిసినా.. బీజేపీ ఓటింగ్ మాత్రం వైసీపీ వైపు వెళ్లే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.