Pawan Kalyan Amaravati : అమరావతి రాజధాని భూములపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామస్థులకు మద్దతుగా నిలిచిన ఆయన వారి వద్ద అమరాతి రైతుల ఉద్యమాన్ని ప్రస్తావించారు. ఒక గ్రామ ప్రజలు చేస్తున్న పోరాటాన్ని.. 29 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఉద్యమంతో పోల్చుతూ మాట్లాడారు. అమరావతి రాజధానికి 29 గ్రామాల ప్రజలు 32 వేల ఎకరాలను స్వచ్చందంగా భూములిచ్చారు. గత మూడేళ్లుగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పోరాటబాట పట్టారు. అయితే ఇప్పటం గ్రామస్తులు చూపిన తెగువ, ధైర్యాన్ని అమరావతి రైతులు చూపించి ఉంటే వారికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. రాజధాని ఇంచు కూడా కదిలించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు. అయితే పవన్ తాజా కామెంట్స్ పై రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పవన్ ఎందుకీ వ్యాఖ్య చేశారన్న చర్చ కూడా ఊపందుకుంది. ఆయన ఏం చెప్పాలనుకున్నారన్న దానిపై పొలిటికల్ సర్కిల్ లో చర్చ ప్రారంభమైంది.

కేవలం రాజకీయ కక్షతో.. జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారన్న కారణంతోనే ఇప్పటంలో ఇళ్లు కూల్చివేశారన్నది పవన్ వాదన. లేదూ తాము ముందస్తు నోటీసులిచ్చి.. స్పందించకపోతేనే ఇంటి ప్రహరీలను కూల్చామని ప్రభుత్వం చెబుతోంది. తమకు ఎటువంటి నోటీసులందించకుండా కూల్చివేశారని కోర్టును ఆశ్రయించిన బాధితులకుఅక్కడ ఉపశమనం లభించింది. అయితే నోటీసులందించినట్టు ప్రభుత్వ ప్రూవ్ చేయడంతో.. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు తిరిగి బాధితులకులక్ష రూపాయల చొప్పన న్యాయస్థానం జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో బాధితులు 39 మందికి రూ.లక్ష చొప్పున రూ.39 లక్షలను పవన్ అందించారు. ఈ సందర్భంలో అమరావతి రైతుల ఉద్యమంతో ఇప్పటం గ్రామస్థుల పోరాటాన్ని పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఇప్పుడు రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ఎంపిక జరిగింది. 29 గ్రామాల ప్రజలు 32 వేల ఎకరాలను రాజధానికి అందించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు పోరాటబాట పట్టారు. ఈ నెల 18 నాటికి ఉద్యమానికి మూడేళ్లవుతుంది. అమరావతికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కూడా సంఘీభావం తెలిపారు. అమరాతికే తమ పార్టీ మద్దతు అని స్టాండ్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇప్పటం గ్రామంలో ప్రహరీ కూల్చివేత ఘటనతో అమరావతి రాజధాని ముడిపెట్టి మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే అమరావతి ఉద్యమానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ తాజా కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వైఫల్యం చెందారని అర్ధం వచ్చేలా పవన్ వ్యాఖ్యలున్నాయి. దీంతో పవన్ తాజా కామెంట్స్ తో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అమరావతి ఉద్యమం విషయంలో మారిన పవన్ స్టాండ్ ను చూసి టీడీపీ శ్రేణుల్లో కూడా కలవరం ప్రారంభమైంది. జగన్ మూడు రాజధానుల అంశాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో.. అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేలా పవన్ కామెంట్స్ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే పవన్ అమరావతి రైతుల్లో స్ఫూర్తిని రగిల్చేందుకే ఈ వ్యాఖ్య చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతికి మద్దతుగా రైతులు మహా పాదయాత్ర 2.0శ్రీకారంచుట్టారు. అమరావతి టు అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టారు. కానీ మార్గ మధ్యలో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ తాజా కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇప్పటం తరహాలో ఐక్యతగా, మొండిగా పోరాడితే సత్ఫలితం ఉంటుందని అమరావతి రైతులకు పవన్ సలహాలో భాగంగానే తాజా కామెంట్స్ అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. . మొత్తానికైతే పవన్ తాజా కామెంట్స్ అమరావతి రైతులు ఆహ్వానిస్తుండగా.. చంద్రబాబు మాత్రం కాస్తా కలవరపాటుకు గురవుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని పవన్ ముందుండి నడిపితే తమ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చంద్రబాబు అండ్ కోకు ఆలోచనలో పడేస్తోంది.