Pawan Kalyan: ప్రజారాజ్యం పార్టీలా జనసేనను కానివ్వను అని.. పార్టీలోని కోవర్టులను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పార్టీలో ఉంటూ ఇబ్బంది పడొద్దు.. అలాంటి వారు దయచేసి పార్టీ నుంచి వెళ్లిపోయి వేరే పార్టీలో చేరండి.. నా శత్రువు ఎదుటి పార్టీలో ఉంటేనే నాకు తెలుస్తుంది. గతంలో జరిగిన తప్పులు జరనీయను. జనసేనలో ఉంటూ పక్కవారికి సహకరిస్తే ఊరుకోను.. పార్టీలో ఉంటూ ఏ ఒఖ్క తప్పు చేసినా సస్పెండ్ చేస్తాం.. కేసీఆర్ మాదిరి వ్యూహాలతో ముందుకెళ్తా’ అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో కోవర్టులకు చోటు లేదని.. అలాంటి వారు వెళ్లిపోవచ్చని పార్టీ సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

దీన్ని జనసేనను నీరుగార్చడానికి ప్రత్యర్థులు కోవర్టులను ఇందులోకి పంపారని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారికి ముందే హెచ్చరికలు చేసి సాగనంపడానికి పవన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యంలా జనసేన కానివ్వకూడదని పవన్ డిసైడ్ అయిన తీరు ఆయన భవిష్యత్ రాజకీయాలను సూచిస్తోంది.
ఒక బలమైన మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను.. ఆ మార్పు వచ్చే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు నాయకులకు, శ్రేణులకు పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా పోరాటాల్లో ముందుకు వెళుతూ పార్టీ పటిష్టత కోసం నాయకులు జనసేన శ్రేణులు ఏం చేయాలన్న దానిని వివరించారు.
సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే అధికారం రాసి పెట్టి ఉంది అనేలా పరిస్థితి ఉంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. దీనికి కచ్చితంగా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, అధికారం దక్కాలి. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న కులాలను దగ్గర చేసుకోవాలి. వారికీ జనసేన పార్టీ ఉందన్న భరోసా కల్పించాలి. అగ్రవర్ణ కులాలకు చెందిన యువత కచ్చితంగా వెనుకబడిన తరగతుల కులాలకు పెద్దన్నగా వ్యవహరించి వారిని రాజకీయంగా ముందుకు తీసుకురావాలి. రాజకీయ సాధికారతను సాధించాలి. పార్టీకి బలంగా పనిచేసే నాయకులను పార్టీలో పని చేసేందుకు ఆహ్వానించాలి. కేవలం ఒక ఎన్నికల కోసం వచ్చే వారిని పక్కన పెట్టండి. మార్పు వచ్చే వరకు బలంగా పార్టీ కోసం పని చేసే వారిని కచ్చితంగా ప్రోత్సహించండి. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న జన సైనికులను అధ్యక్షులే గౌరవంగా చూసుకోవాలి. వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, పార్టీ కోసం పని చేయించండి. జీరో బడ్జెట్ రాజకీయాలు పేరు చెప్పి, తమ తోడుగా వచ్చే జన సైనికులకు కాఫీ, టీ లు కూడా ఇవ్వకుండా చేయకండి. వీర మహిళలకు రక్షణగా నిలబడండి. వారికి ఎలాంటి ఆపద వచ్చిన జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకోండి. వీర మహిళలపై వ్యక్తిగతంగా, అసభ్యకరంగా మాట్లాడే వారిపై కచ్చితంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని జిల్లా ఎస్పీ అధికారుల వద్దకు సమస్యను తీసుకువెళ్లండి. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వీర మహిళలను రక్షించుకోవడం పార్టీ ప్రాథమిక బాధ్యత.

* నా నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ
పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ తప్పొద్దు. మనం రాజకీయ శత్రువులతో పోరాడాలి తప్పితే, మనలో మనమే యుద్ధం చేసుకుంటే చూసే వారికి కూడా లోకువగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ తప్పితే మాత్రం ఊరుకునేది లేదు. దీనిపై త్వరలోనే క్రమశిక్షణ కమిటీని నియమిస్తాం. ఈ కమిటీకి నేనే నేతృత్వం వహిస్తాను. ఎవరి పరిధి వారికి ఉంటుంది. పార్టీలో కచ్చితంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దానిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి సోషల్ మీడియా ఎక్కి రచ్చ చేస్తే మాత్రం సహించేది లేదు. పార్టీని కాపాడుకోవాలంటే కచ్చితంగా జన సైనికుల దగ్గర నుంచి వారిని నడిపించే నాయకుల వరకు క్రమశిక్షణ పాటించాల్సిందే. ఏమైనా సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్యన చర్చ జరగాలి తప్పితే, బహిరంగంగా మాట్లాడితే మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒక వేళ పార్టీ తీరు నచ్చకపోతే మీరు వేరే పార్టీలోకి వెళ్లినా అభ్యంతరం లేదు. అంతేగాని పార్టీలో ఉండి మాత్రం కట్టు తప్పొద్దు. పార్టీలో ఉండి ఇతర పార్టీ నాయకులతో రాజకీయాలు చేసే నాయకుల తీరు నాకు అసలు నచ్చదు. సొంత పార్టీకి ద్రోహం చేసి ఇతరులతో కలిసే నాయకుల తీరు నాకు తెలుసు.
* అప్రమత్తంగా ఉండండి
పార్టీ నిర్మాణ క్రమంలో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తాం.. పదవులు ఇస్తాం అని ప్రచారం చేసే నాయకులపై అప్రమత్తంగా ఉండండి. జిల్లాల అధ్యక్షులు ఇలాంటి వారిపై దృష్టిపెట్టండి. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను ఏమాత్రం విస్మరించవద్దు. వారికి అర్ధరాత్రి కష్టం వచ్చినా సరే జిల్లా స్థాయి నాయకులు కదిలి వెళ్లాలి. మేమున్నామని భరోసా వారికి కచ్చితంగా కల్పించాలి” అని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరి పోశారు.
[…] […]