
Janasena Formation Day Meeting: జనసేన ఆవిర్బవించి పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సుదీర్ఘ విరామంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఏపీ రాజకీయ యవనికపై జనసేన ఒక అత్యుత్తమైన రాజకీయ పార్టీగా అవతరించింది. పవర్ పాలి‘ట్రిక్స్’కు దూరంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా తీసుకొని జనసేన పోరాడింది. ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొంది. రాజకీయ పార్టీ అంటే గెలుపు కాదు.. ప్రజల బాగోగులు, వారి సమస్యల పరిష్కార వారధిగా జనసేనను పవన్ తీర్చిదిద్దగలిగారు. ఈ సుదీర్ఘ పోరాటంలో లక్షలాది మందిని సుశిక్షిత జన సైనికులుగా మార్చగలిగారు. భాగస్వామ్యం కల్పించారు. ఒక రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ పదో ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. మార్చి 14న మచిలీపట్నంలో వేడుకలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సువిశాల 36 ఎకరాల ప్రాంగణంలో సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
అయితే ఈసారి మచిలీపట్నంను వేదికగా చేసుకోవడానికి అనేక కారణాలున్నాయి. నివార్ తుఫాను సమయంలో పవన్ మచిలీపట్నంలో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రైతుల బాధలను అప్పటి ప్రభుత్వానికి నివేదించారు. నాటి తుఫాను నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించగలిగారు. నాటి విపత్తుతో విలవిల్లాడిన ఏపీకి ఇతోధికంగా సాయమందించడంలో పవన్ పాత్రను ఇప్పటికీ రైతులు గుర్తుచేసుకుంటారు. అందుకే పార్టీ పదో ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించడానికి అటు జనసేనాని, ఇటు జన సైనికులు నిర్ణయించారు.ఇదే విషయాన్ని ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం కుట్రలు చేధించేలా.. ఏపీకి దిశ దశ చూపేలా జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని మనోహర్ వెల్లడించారు.

మచిలీపట్నంను వేదికగా చేసుకోవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి వరకూ మంత్రిగా ఉన్న పేర్ని నాని వాడే భాష, వ్యవహార శైలి అందరి తెలిసిన విషయమే. ముఖ్యంగా జనసేన, పవన్ విషయంలో పేర్ని నాని అభ్యంతర వ్యాఖ్యాలు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయంగా తూలనాడడం, పరిహసిస్తూ మాట్లాడడం రివాజుగా మారింది. ఈ తరుణంలో మచిలీపట్నం ను వేదికగా చేసుకొని ఆవిర్భావ సభ నిర్వహిస్తుండడంతో అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. తొమ్మిదో ఆవిర్భావ సభ ఇప్పటంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సభ నిర్వహణకు భూములిచ్చారని గ్రామస్థులకు వైసీపీ సర్కారు పెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవలు అందకుండా చేశారు. ఆక్రమణల పేరిట ఇళ్లను సైతం తొలగించారు. చివరకు బాధితులు కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. అటు పవన్ సైతం ఇప్పటం బాధితులకు అండగా నిలిచారు. ఆర్థిక సాయం కూడా చేశారు.
ఇటువంటి తరుణంలో పదో ఆవిర్బావ సభను మచిలీపట్నంలో నిర్వహించడానికి జనసేన డిసైడ్ కావడం సాహసంతో కూడుకున్న పనే. కానీ ఎప్పుడైతే మచిలీపట్నం ను వేదికగా ప్రకటన చేశారో.. అప్పటి నుంచి జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి సభా వేదికకు వారాహి వాహనంపై ర్యాలీగా తరలిరానున్నారని తెలిసి జన సైనికులు ఖుషీ అవుతున్నారు. అటు పార్టీ పదో వార్షికోత్సవ సభ, ఇటు వారాహి వాహనం రోడ్డుపైకి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. దీంతో జనసేన సమరశంఖం మోగించినట్టేనని భావిస్తున్నారు. పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికగా అధికార వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని జన సైనికులు బలంగా చెబుతున్నారు. పవన్ తన స్పీచ్ లతో అధికార పార్టీ నేతలకు గట్టి హెచ్చిరికలు పంపే చాన్స్ ఉంది. అయితే గత అనుభవాల దృష్ట్యా భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నట్టు నాదేండ్ల మనోహర్ ప్రకటించారు.