Pawan Kalyan: 14 నుంచి జనంలోకి పవన్.. జనసేన భారీ యాక్షన్ ప్లాన్

పవన్ రెండో దశ పర్యటనకు సంబంధించి సైతం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ పర్యటన ఉంటుంది.

Written By: Dharma, Updated On : February 11, 2024 12:06 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీలో జనసేన దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. మొదటి దశలో పొత్తు, రెండో దశలో కేడర్ కు దిశానిర్దేశం, మూడోదశలో ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఆ మధ్యన వారాహి యాత్ర తర్వాత.. పవన్ అడపాదడపా సమావేశాలకు పరిమితమయ్యారు. ఇన్నాళ్లు అంతర్గత సమావేశాలు, నియోజకవర్గ సమీక్షలు జరిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించుకున్నారు.

ఈనెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన కొనసాగునుంది. ఈ పర్యటనలో టిడిపి, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో భాగంగా రెండు పార్టీల మధ్య చాలా నియోజకవర్గాల్లో వివాదాలు ఉన్నాయి. నేతల మధ్య విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి వాటికి పవన్ చెక్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలను ఒక దగ్గర కూర్చోబెట్టి సమన్వయం చేయనున్నారు.మరోసారి వివాదాలు బయటకు రాకుండా చూసుకోవాలని వారికి అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.

ఇక పవన్ రెండో దశ పర్యటనకు సంబంధించి సైతం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ పర్యటన ఉంటుంది. పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహాలను అమలు చేయనున్నారు. టిడిపి తో ఎలా సమన్వయం చేసుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి. అన్నదానిపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం పవన్ చేయనున్నారు. ఇప్పటికే పవన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొత్తు పై ప్రభావం చూపే ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని తేల్చి చెప్పారు. ఏమైనా ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు నేరుగా పవన్ రంగంలోకి దిగనుండడంతో జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది.