Pawan Kalyan Varahi Yatra: జగన్ ను ఇరికిస్తూ ఉత్తరాంధ్రను షేక్ చేసిన పవన్ కళ్యాణ్

ఇప్పటికే రుషికొండ వివాదంలో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్నాళ్లు అక్కడ నిర్మాణాలు పై కుంటి సాకులు చెబుతూ వస్తున్నా... పవన్ పరిశీలనకు వెళ్లేసరికి బెంబేలెత్తిపోయింది.

Written By: Dharma, Updated On : August 14, 2023 7:02 pm

Pawan Kalyan Varahi Yatra

Follow us on

Pawan Kalyan Varahi Yatra: విశాఖలో వారాహి 3.0 యాత్ర ఎన్నో సంచలనాలకు వేదికగా మారుతుంది. యాత్రలో ఒకవైపు పవన్ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు వైసిపి నేతల అక్రమాలను ఎండగడుతున్నారు. వివాదాస్పద స్థలాలను పరిశీలించి.. దాని వెనుక ఉన్న నేతల గుట్టును రట్టు చేస్తున్నారు. పవన్ తాజా చర్యలతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది. రోజుకో నాయకుడి అవినీతిని బయటకు తీస్తుండడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇప్పటికే రుషికొండ వివాదంలో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్నాళ్లు అక్కడ నిర్మాణాలు పై కుంటి సాకులు చెబుతూ వస్తున్నా… పవన్ పరిశీలనకు వెళ్లేసరికి బెంబేలెత్తిపోయింది. అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నామంటూ అధికారికంగా ట్విట్టర్లో వెల్లడించాల్సి వచ్చింది. మరోవైపు న్యాయ పరమైన చిక్కులు వెంటాడుతాయని భయపడి ట్విట్టర్లో వెల్లడించిన అంశాలను తొలగించింది. పొరపాటున అలా పెట్టినట్లు సర్ది చెప్పుకొంది. రిషికొండ విషయంలో కక్కలేక. మింగలేక సతమతమవుతోంది. ఇదంతా పవన్ వెళ్లి వచ్చిన తర్వాతే జరగడం విశేషం.

అటు విశాఖలో శాంతిభద్రతల విషయంలో పవన్ వైసీపీ సర్కార్ పై నేరుగా విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి మానవ అక్రమ రవాణా జరుగుతోందని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇది కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. విశాఖ కేంద్రంగా జరిగిన భూ కబ్జాలను, అక్రమ పర్వాలను పవన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎండగడుతున్నారు. తొలుత విశాఖ ఎంపీ ఎంవీ సత్యనారాయణ అక్రమ నిర్మాణాలను పవన్ పరిశీలించారు. ఎంపీ భూదందాను బయటపెట్టారు. ఇది పెద్ద ప్రకంపనలే సృష్టించింది. తాను వ్యాపారం చేస్తున్నానని అని మాత్రమే ఎంపీ చెప్పగలిగారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేకపోయారు.

అయితే ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్ అవినీతి ఆగడాలను పవన్ బయటపెట్టారు. అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో ఎటువంటి అనుమతి లేకుండా వేస్తున్న వెంచర్లను పరిశీలించారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్న విషయాన్ని బయటపెట్టారు. దీని వెనుక ఉన్న మంత్రి సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని పవన్ ఆరోపించారు. ఉత్తరాంధ్రను ఎటువంటి అభివృద్ధి చేయకపోగా… ఉన్న వనరులను దోచుకుంటున్నారని పవన్ ధ్వజమెత్తారు. మొత్తానికైతే పవన్ తన వారాహి యాత్ర ద్వారా ఉత్తరాంధ్ర వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సీఎం జగన్ పై నేరుగా ఆరోపణలు చేస్తూనే.. క్షేత్రస్థాయిలో వైసిపి నేతల ఆగడాలను ఎండగడుతున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.