Pawan Kalyan : రాజకీయాల్లో మంచి అన్నదానికి తావు ఉండదు అన్న నానుడి ఉంది. కరెక్టే మంచితనం అనే ఫార్ములాతో ముందుకు సాగిన మెగాస్టార్ చిరంజీవిని ఈ రాజకీయ సమాజం ఎలా మార్చింది. ఎలా అణగదొక్కింది అందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే ఫార్ములా వర్కవుట్ అవుతుందని ఆశించిన వారి ఆశలు నీరుగారిపోయాయి. ప్రయత్నాలు అంతగా వర్కవుట్ కాలేదు. పవన్ ది ఆది నుంచి పోరాట పంథాయే. మనిషిని మనిషిగా చూసే గొప్ప మనసు పవన్ కు సొంతం. అది జనాలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. దార్శనిక నేతగా పవన్ ఆవిష్కృతమవుతున్నారు. అయితే ఇది ఒక రోజులో.. ఒక రాత్రిలో వచ్చిన మార్పు కాదు. 2008 నుంచి తగిలిన ఎదురుదెబ్బలను గుణపాఠాలుగా మార్చుకొని.. రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొని పవన్ నిలబడ్డారు. జనసేనను ఏపీ రాజకీయ యవనికపై నిలబెట్టారు. ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు తెలుగునాట రాజకీయ కుయుక్తులకు తెరమరుగైన వేళ…జనసేనను కూడా తక్కువ చేసిన నేతలకు జవాబిచ్చేలా పవన్ పార్టీని నిలబెట్టిన తీరు అభినందనలు అందుకుంటోంది.

కష్టం చెప్పుకోవడానికి వచ్చే వారిని అక్కున చేర్చుకున్న గొప్ప మనసు పవన్ ది. ప్రజల కోసం అంత పెద్ద స్టార్ డమ్ ను వదులుకొని రాజకీయ బాట పట్టారు. వేల కోట్ల సంపద ఉన్న వారు సైతం మనకెందుకీ జనాలతో అని అభిప్రాయపడే రోజులివి. కానీ పట్టు పాన్పులు, వందల కోట్ల రూపాయల సంపాదనను వదులుకొని మరీ ప్రజల కష్టాలే తన ఇష్టాలుగా మార్చుకొని వారికి ఇతోధికంగా సాయం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్. చేతిలో అధికారం లేదు. వందల కోట్ల ఐశ్వర్యం లేదు. కేవలం తన స్వేదంతో సంపాదించిన కష్టార్జితాన్ని పేదల కోసం ఖర్చుపెడుతున్న ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను చూసి చలించిపోయిన మనసు పవన్ ది. గంగపుత్రుల కడగండ్లను చూసి బరువెక్కిన మనసు ఆయనది. సాగు గిట్టుబాటుకాక.. పెట్టుబడులు రాక బలవన్మరణాలకు పాల్పడిన కౌలురైతు దయనీయ బతుకులు చూసి కన్నీరుకార్చిన రైతుబాంధవుడు పవన్. అందుకే వారి సమస్యల పరిష్కరానికి ప్రభుత్వాలపై పోరాడుతునే..మరోవైపు తన కష్టంలోకొంత మొత్తాన్ని అందించి వారి కన్నీరుతుడిచిన ఒకేఒక నాయకుడు పవన్.
ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠంతో ఎన్నో పాఠాలు నేర్చుకున్న పవన్… అదే పీఆర్పీ అకాల నిష్కృమణ కూడా ఇబ్బందులు తెచ్చి పెట్టింది. పీఆర్పీ మాదిరిగా జనసేన కూడా నిష్కృమిస్తుందని ఒక విధమైన అపవాదు ప్రజల్లో ఉండేది. దానికి రాజకీయ విష ప్రచారం తోడైంది. వాటన్నింటినీ తట్టుకొని జనసేన అనేది పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ అని పవన్ కలబడ్డారు.. నిలబడ్డారు. సుదీర్ఘ కాలం ప్రజల మధ్యేనే ఉంటూ పార్టీని నిలబెట్టగలిగారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిపారు. కష్టం వచ్చిన కర్షక, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలకు అండగా నిలిచారు. వారి హక్కులకు, సమస్యల సాధనకు నడుంబిగించారు. అందుకే పవన్ అందరి వాడయ్యాడు. అందరి తలలో నాలుకగా మారాడు. అందరికీ ఇష్టుడిగా మారాడు.
పవన్ తో కలిసే ముందు ఒక ఎత్తు.. కలిసిన తరువాత మరో ఎత్తు.. అంటూ ఆయన సహచరులు, అభిమానించే వారు చెబుతారు. పవన్ ఆలోచింపజేసే ప్రసంగాలు, ఆయనిచ్చిన భరోసా, ఇచ్చే హామీలు సైద్ధాంతికంగా ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన విమర్శలు ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టిస్తాయి. అభిమానులకు ఆకట్టుకుంటాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి పరిణామాలు తీసుకుంటే.. ఎక్కడా అధికారం కోసం అర్రులు చాచలేదు. పదవుల కోసం దేబిరించలేదు. అవకాశం ఉన్నా.. అవకాశం కల్పించే ప్రభుత్వాలు ఉన్నా.. ఏనాడూ తలవంచలేదు. మద్దతు తెలిపాను కదా.. అని ప్రభుత్వాలను ప్రశ్నించడం వీడలేదు. ఈ సుగుణాలే పవన్ ను అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఆవిష్కృతం చేశాయి. రాజ్యాధికారాన్ని మరింత దగ్గర చేస్తున్నాయి.