Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Murder: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం

YS Viveka Murder: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం

YS Viveka Murder: వైఎస్ వివేకానందరెడ్డి….మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్. అటువంటి వ్యక్తిని పులివెందులలో ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. అయితే ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా అసలు నిందితులు చిక్కలేదు. కేసు కొలిక్కి రాలేదు. పెద్ద పెద్ద కేసులు, మిస్టరీలనే రోజుల వ్యవధిలో రట్టు చేస్తున్న తరుణంలో సాగదీత వెనుక లోగుట్టు ఏమిటని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వారు.. ఇప్పుడు సొంత మనుషులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా కేసు విచారణలో అనేక ట్విస్టులు వెలుగుచూశాయి. సీబీఐ విచారణ సాగుతున్న సమయంలో ఇప్పుడు మరో కీలక ట్విస్ట్. కుటుంబకలహాల నేపథ్యంలో ఆయన్ను దారుణంగా హత్య చేశారని కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమె ఏకంగా సీబీఐ విచారణనే తప్పుపడుతూ అటు కుటుంబసభ్యులు, రాజకీయ ప్రత్యర్థుల పాత్రపై అనుమానిస్తూ కోర్టు ముందు కొన్ని సందేహాలను ఉంచారు.

 

శంకర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. వివేకానందరెడ్డి హత్య తరువాత ప్రధానంగా శంకర్ రెడ్డి పేరే వినిపించింది. ఆయన ప్రోద్బలంతోనే హత్య జరిగినట్టు సీబీఐ నిర్థారణకు వచ్చి అరెస్ట్ చేసింది. అయితే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని.. కుటుంబకలహాల నేపథ్యంలో సొంత కుటుంబసభ్యలే టీడీపీ నేతలతో కుమ్మక్కై హత్యచేశారని ఆరోపిస్తూ ఫిబ్రవరిలో తులసమ్మ పులివెందుల కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణకు రావడంతో ఆమె కీలక వాంగ్మూలం ఇచ్చారు.2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి పులివెందులోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. విపక్ష నేతగా ఉన్న జగన్ నాటి టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. అయితే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన టీడీపీ ప్రభుత్వం.. జగన్ డిమాండ్ తో కేసును సీబీఐకి అప్పగించింది.

వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. జగన్ కు స్వయాన బాబాయ్ కావడం, రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు రావడం, సరిగ్గా ఎన్నికల ముందు ఘటన జరగడంతో సానుభూతి పనిచేసింది. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూరింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసు నీరుగారిపోయింది. మరుగునపడిపోయిందన్న కామెంట్స్ వినిపించాయి. విపక్షంలో ఉన్నంతవరకూ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పారు. అయితే వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. దీంతో విచారణ కొనసాగుతోంది. కానీ ఎడతెగని జాప్యం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఒత్తడితోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేసులో ే5 నిందితుడి భార్య కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం చేశారు.

వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారితీశాయని ఆమె పేర్కొన్నారు. రెండో భార్య షమీమ్ కు ఆస్తిలో వాటా ఇస్తాననడంతో పాటు ఆమె కుమారుడ్ని వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడంతో ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలో ఆందోళన మొదలైందని వివరించారు. వివేకా కుటుంబ వారసత్వాన్ని ఆశిస్తున్న అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డి హత్యకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. హత్య అనంతరం వివేకా కుటుంబసభ్యల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండేదని పేర్కొన్నారు. వివేకా హత్య అనంతరం ఆయన పీఏ కృష్ణారెడ్డి కుటుంబసభ్యులకే సమాచారం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హత్య తరువాత వివేకా గుండెపోటుతో చనిపోయిన విషయాన్ని శివప్రకాష్ రెడ్డి ఎందుకు చెప్పారని.. అది కూడా వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఎందుకు తెలియజేశారని వాంగ్మూలంలో సందేహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎమ్మెల్సీ బీటెక్ రవి పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వివేకా ఉన్నంత కాలం పులివెందులలో రాజకీయంగా తలపడలేమని భావించి బీటెక్ రవి హత్యకు సహకరించారని చెప్పారు. వివేకానందరెడ్డి అనుచరుడిగా ఉన్న కొమ్ము పరమేశ్వరరెడ్డి మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తడంతో ఆయన బీటెక్ రవి పంచన చేరారని గుర్తుచేశారు. వీరు తరచూ హోటళ్లలో కలుసుకునేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వివేకా హత్యకు వ్యూహరచన జరిగిందన్నారు. రాజశేఖర్ రెడ్డి , శివప్రకాష్ రెడ్డి వైజీ రాజేశ్వరరావు రెడ్డితో భేటీ అయి హత్యకు స్కెచ్ గీశారని.. దానికి బీటెక్ రవి, పరమేశ్వర్ రెడ్డిలు సహకరించారని తులసమ్మ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే కేసును పక్కదోవ పట్టిస్తోందన్నారు. అందుకే అనుమానితులందర్నీ అరెస్ట్ చేసి విచారించాలని ఆమె కోర్టుకు విన్నవించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular