
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయంలో జన సైనికులకు పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో జరుగుతున్న విష ప్రచారం ట్రాప్ లో పడవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పడం ద్వారా పవన్ పొత్తుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. అయితే ఇంతవరకూ పొత్తుల గురించి చర్చలు జరపలేదు. కానీ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని పొత్తులు, సీట్లు అంటూ జనసేనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జనసేన ఆవిర్భావ సభలో పవన్ పొత్తుల విషయం తేల్చేశారు. జనసేనకు 20 సీట్లు అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. పొత్తుల వ్యూహాలు తనకు విడిచిపెట్టాలని కోరారు. అయితే తాజాగా ఆయన స్పందించారు. మైండ్ గేమ్ కు లొంగేది లేదని.. పొత్తులపై పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
‘ఫేక్’ ప్రచారానికి చెక్..
జనసేనపై అధికార వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక విష ప్రచారానికి దిగింది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరుతుందన్న వార్తల నేపథ్యంలో ఫేక్ ఐడీలతో పొత్తులు, సీట్లు అంటూ ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది, చివరకు కొన్ని టీవీ చానళ్ల లోగోలతో స్క్రోలింగ్ వస్తున్నట్టు చూపి రెండు పార్టీల మధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. జనసేన తక్కువ సీట్లతో సర్దుబాటు చేసుకుందంటూ ప్రచారం చేస్తోంది. దీంతో జన సైనికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జనసేన యాక్టివ్ నాయకులతో మాట్లాడారు. వైసీపీ మైండ్ గేమ్ లో భాగమని.. పొత్తుల వ్యూహాలు పార్టీలో చర్చిస్తామని పవన్ పేర్కొన్నట్టు సమాచారం. పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. పొత్తులపై పవన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
జనసేనను తగ్గించే ప్రయత్నం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీలో నిరుత్సాహం అలుముకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు వామపక్షాలు సైతం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. టీడీపీకి రెండో ప్రాధాన్యత ఓట్లు వేసి విజయానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ, వామపక్షాలు కూటమి కడతాయన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే తమకు ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమని వైసీపీ నేతలు డిసైడయ్యారు. అందుకే సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ కేవలం 20 సీట్లను మాత్రమే జనసేనకు ఇచ్చిందని,.. దానికి పవన్ సైతం ఒప్పుకున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో జనసైనికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందించాల్సి వచ్చింది.

టీడీపీకి గట్టి సంకేతాలు..
ఇప్పటికే పవన్ పొత్తులపై మాట్లాడారు. ఇచ్చిపుచ్చుకోవడంలో గౌరవం, పొత్తులో పారదర్శకత ఉంటేనే జనసేన కలిసి వెళుతుందని.. గౌరవం లేని చోట ఉండలేమని కూడా తేల్చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీచేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో టీడీపీ ఎల్లో మీడియా కూడా కొంచెం అతి చేస్తోంది. అటు టీడీపీతో కలవకుండా ఉండాలని వైసీపీ బలంగా కోరుకుంటోంది. ఈ రెండు పార్టీల విష ప్రచారం, మైండ్ గేమ్ ఆడుతుండడంతో పవన్ అలెర్టయ్యారు. తానే స్వయంగా పొత్తుల విషయం ప్రకటిస్తానని.. అప్పటివరకూ ఏ ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తానికైతే అటు టీడీపీకి, ఇటు వైసీపీకి పవన్ గట్టి ఝలక్ ఇచ్చారు.