
జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమోషనల్ గా మాట్లాడారు. 10 ఏళ్ల తన రాజకీయ పార్టీ ప్రస్థానం ముందుగా గుర్తు చేసుకున్నాడు. తాను పార్టీ పెట్టినప్పుడు కేవలం ఒక్కడినే అని.. అప్పుడు ఎవరూ లేరని పవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులకు ఆరాధ్యుడిగా ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మచిలీపట్నంలో జనసేన 10వ వార్షికోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అశేషంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనసైనికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయన అంతమంది జనసైనికులను చూసి చలించిపోయారు.
ఇక పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. టీడీపీతో తాను పొత్తు పెట్టుకుంటానని.. దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీచేయాలని సవాల్ చేస్తున్న వైసీపీకి పవన్ కౌంటర్ ఇచ్చారు. తనకు టీడీపీపై ప్రేమలేదని.. ప్రజలు కనుక తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తామనే నమ్మకం ఇస్తే ఖచ్చితంగా తాను ఒంటరిగా పోటీచేయడానికి వెనుకాడనంటూ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.
అందరూ అనుకుంటున్నట్టు తాను టీడీపీతో పోటీకి వెంపర్లాడడం లేదని.. సర్వేల్లో క్షేత్రస్థాయిలో జనసేనకు ఓట్లు వేద్దామని మీరు బలంగా విశ్వసిస్తే తాను ఒంటరిగా పోటీచేస్తానని పవన్ ప్రకటించారు. ఈ మాట పొత్తు కోసం వెంపర్లాడుతున్న ప్రతిపక్ష టీడీపీకి గట్టి షాకిచ్చేలా ఉంది. ఇన్నాళ్లు పొత్తు కోసం చూసిన టీడీపీ పవన్ మాటతో ఎలా అడుగులు వేస్తుందన్నది వేచిచూడాలి.