
Jansena: మచిటీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ అశేష జనవాహిని నడుమ జరిగింది. సభా వేదికపైకి పవన్ చేరుకున్న వెంటనే ప్రాంగణమంతా ఒక్కసారిగా హోరెత్తింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు విశేష స్పందనలు వచ్చాయి. భావోద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు.
మచిలీపట్నంలో జనసేన 10వ వార్షికోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అశేషంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనసైనికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయన అంతమంది జనసైనికులను చూసి చలించిపోయారు. జనసేన ప్రారంభించి ఇప్పటికీ 10 ఏళ్లు అవుతుందని, అప్పుడు ఎవరూ లేరని అన్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారని భావోద్వేగానికి గురయ్యారు.
ముందుగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులను అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సగటు మనిషికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ ప్రారంభించినట్లు చెప్పారు. పింగళి వెంకయ్య స్ఫూర్తి అని, పేదలకు మేలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని అన్నారు. తెలంగాణాలో కూడా 30 వేల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ముందు ముందు మరింత విస్తరించి ఎప్పటికైనా జనసేనను అధికారంలోకి తీసుకువస్తానని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానని పేర్కొన్నారు.
కులాలు ముఖ్యం కాదని, మనుషులను కలుపుకుంటూ పోవడమే తన అభిమతమని పవన్ కల్యాణ్ అన్నారు. కులాలు కుంపట్లు పెట్టి వైసీపీ చలి కాచుకుంటుందని, ఒక్కొక్క కులానికి ఒక్కో కార్పొరేషన్ పెట్టి విడదీసి పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు. తనను ఒక్క కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారని, తను మాత్రం అందరినీ కలపుకొనిపోయి రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. జనం మార్పు కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలు సంఖ్యాబలం ఉన్నా.. దేహీ అనే పరిస్థితి ఉందని.. ఇది వారి తప్పు కాదు, అనైక్యతే సమస్య అని అన్నారు.