Parliament : కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం మొదలైన దగ్గర నుంచి దాని ప్రారంభోత్సవం జరిగే వరకు కేంద్రం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ‘భవనానికి సంబంధించిన రాళ్లు అక్కడ నుంచి తీసుకొచ్చాం.. ఇక్కడ నుంచి మోసుకొచ్చాం.. ప్రపంచంలో మాదే బెస్ట్ పార్లమెంట్’ అంటూ డబ్బా కొటుకున్న నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. పార్లమెంట్ ఎన్ని వందల కోట్లతో నిర్మిస్తేనేం? సెక్యూరిటీ కదా ముఖ్యం. ఎంపీల భద్రతకే భరోసా లేకపోతే సామాన్యులు మాటేంటి? వాళ్లకి ఏం సమాధానం చెబుతారు.? ప్రజస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ హౌస్‌పై దాడి జరగడమంటే యావత్ దేశంపై జరిగినట్టే కదా?
సరిగ్గా 22ఏళ్ల క్రితం ఇదే జరిగింది కదా.. మరి ఆ లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? లోక్‌సభలోకి ఆగంతకులు దూసుకురావడం.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. షూ లో నుంచి పొగను బయటకు వదలడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు సెక్యూరిటీ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పార్లమెంట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్‌పై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
పార్లమెంట్ లో జరిగిన ఘటన దేశం మొత్తాన్ని కలవరపరుస్తోంది. భారత భద్రత వ్యవస్థ ఇంతటి లోప భూయిష్టంగా ఉందా? దేశ అత్యున్నత పార్లమెంట్ కే భద్రత లేకపోతే ఇక సామాన్యుల భద్రతకు గ్యారెంటీ ఏది అన్నది సామాన్యులను తొలుస్తున్న సమస్య. ఇది ఖచ్చితంగా మన భద్రతా వైఫల్యంగా చూడాల్సిన అవసరం ఉంది. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే..
దీని గురించి పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. దర్యాప్తు పూర్తి కావాలి. దేశం మొత్తం కూడా ఒకే అభిప్రాయంతో దర్యాప్తు వేగంగా చేయాలని కోరుతున్నారు.