
AP Opposition : ఏపీలో వాక్ స్వాతంత్య్రం లేదు.. భావప్రకటన స్వేచ్ఛకు విలువలేదు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. దాడులకు తెగబడతారు. అరెస్టులకు పురమాయిస్తారు. అవసరమైతే విధ్వంసాలకు దిగుతారు. అధికార పార్టీ నేతల అరాచకాలపై పల్లెత్తు మాట అనకూడదు. వారిని అసలు ప్రశ్నించకూడదు. పొరపాటున ఎవరైన గొంతెత్తినా.. వారి చర్యలను తప్పుపట్టినా వైసీపీ నాయకులు, శ్రేణులు దాడులకు తెగబడతారు. విపక్ష నాయకులు, కార్యాలయాలపై దాడులకు దిగుతారు. మరణాయుధాలతో దాడులు చేస్తారు. ఇళ్లు, భవనాలు, వాహనాలను తగులబెడతారు. గత నాలుగేళ్లుగా ఈ విధ్వంసాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. ప్రశాంత వాతావరణానికి నెలవైన ప్రాంతాలను సైతం వివాదాస్పదంగా మార్చగలగడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయినంతగా మరెవరూ కాలేదు.
గన్నవరం… పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రశాంతతకు నెలవైన ప్రాంతంగా గుర్తించబడింది. గొడవలు, కక్షలు మాటే ఎరుగని ప్రాంతం. అక్కడ కూడా విధ్వంసం సృష్టించగలిగారు. నిప్పలగుండంగా మార్చగలిగారు. వైసీపీ నేతల విమర్శలకు ప్రతివిమర్శ చేశారన్న కారణం చూపి టీడీపీ నాయకుడు చిన్నాపై దాడిచేశారు. ఆయనకు పరామర్శించడానికి వెళుతున్న పట్టాభిని దారికాచి అరెస్ట్ చేశారు. లాఠీలతో కుళ్లపొడిచారు. అంతటితో ఆగకుండా టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. పోలీసుల ఎదుటే విధ్వంసం సృష్టించారు. ఫిర్యాదుచేసిన బాధిత టీడీపీ నాయకులపైనే ఎదురు కేసులు నమోదుచేయించి అరెస్ట్ లు చేశారు. వైసీపీ అఘాయిత్యాలకు గన్నవరం నియోజకవర్గం పరాకాష్టగా మారింది.
జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే చంద్రబాబు అన్న వారికి లెక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రతిసారి అల్లర్లు సృష్టిస్తున్నారు. ఆయనకు ఎదురెళ్లి మరీ సవాల్ చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 25న అన్న క్యాంటీన్ల ప్రారోంభోత్సవం నాడు చేసిన కవ్వింపు పనులు అన్నీఇన్నీ కావు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలన్న ప్రయత్నంలో ప్రజలతో మమేకం కాకుండా.. విధ్వంసాలనే అజెండాగా మార్చుకున్నారు. టీడీపీ నేతల అత్మస్థైర్యంపె దెబ్బతీసి వారిని తమ దారిలో తెచ్చుకోవాలన్న ఏకైక అజెండాతో పనిచేస్తున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో అధికార పార్టీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అక్కడ విపక్షం లేకుండా చేయాలన్నదే అధికార వైసీపీ అభిమతం. అందుకే టీడీపీ, జనసేనలను టార్గెట్ చేసుకొని చేస్తున్న దుందుడుకు చర్యలు అన్నీఇన్నీ కావు. గత డిసెంబరులో టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి చల్లా రామచంద్రారెడ్డి పర్యటనకు కట్టిన బ్యానర్ల తొలగించి వివాదం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన పాపానికి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులపై దాడులకు దిగారు. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ రైతుల ప్రయోజిత కార్యక్రమం నిర్వహిస్తుంటే అడ్డుకున్నారు. ఆయన ఇంటిపై పోలీసుల సమక్షంలోనే దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు.
మాచర్ల ప్రాంతం ఇప్పుడు మరో బిహార్ ను తలపిస్తోంది. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంతానికి కొత్త తలవంపు తెచ్చిపెడుతున్నారు. గత డిసెంబరులో టీడీపీ నాయకులు తలపెట్టిన ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి జులకంటి బ్రహ్మానందరెడ్డి ఇంటికి నిప్పుపెట్టి రావణకాష్టంలా మార్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ పరిశీలకులుగా మాచర్ల వెళ్లిన బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై నడిరోడ్డులో వాహనంపైనే దాడిచేశారు. ప్రాణాలతో వారు బయటపడ్డారు. ఈ ఘటనకు కారణమైన తురక కిశోర్ మరణాయుధాలతో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేసినా ఆయనపై ఎటువంటి కేసు లేదు. ఈ నాలుగేళ్లలో కనివినీ ఎరుగని విధ్వంసానికి వైసీపీ నేతలు దిగారు. దానిని ఒక పేటెంట్ గా మార్చుకున్నారు.