
Modi BJP : ఐదేళ్లు మిత్రపక్షాల మద్దతుతో పాలన.. తర్వాత 303 లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం.. తిరుగులేని మెజారిటీతో నాలుగేళ్ల పాలన.. మొత్తంగా తొమ్మిదేళ్లు పూర్తయింది. కానీ ఆయన చరిష్మా ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు. ఆయన కాకుంటే ఎవరు అన్న ఆలోచనే ప్రజల్లో కలుగడం లేదు. ఆయనే ప్రధాని నరేంద్రమోదీ. ఐదేళ్ల పాలన తర్వాత సాధారణంగా అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదేళ్లుగా పాలిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. దీనికి మరో కారణం విపక్షాల అనైక్యత కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్ష నేతల వ్యవహారం చూస్తుంటే వీరు మోదీకి మూడోసారి ప్రధాని పదవిని అప్పగించే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
ఒంటరిగా ఆప్..
ఇప్పటికే 2024 ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారత్‌ను అగ్రదేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లో మాత్రమే కాస్త ప్రభావం చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న 20 ఎంపీ స్థానాల్లో ఆప్ కొంత ప్రభావితం చేయగలదు. ఇక కాంగ్రెస్తో జట్టు కట్టకుండా పోటీ చేస్తే, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలి, కొన్ని కాంగ్రెస్, మరికొన్ని ఆప్‌కు పడతాయి. ఫలితంగా బీజేపీకే లాభం చేకూరుతుంది. గుజరాత్, గోవాలోనూ అప్‌కు కొంత ఓటు బ్యాంకు ఉండటంతో అక్కడ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌తోనే దీదీ..
ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వాటితో పాటే బెంగాల్లోని ఓ అసెంబ్లీ స్థానం సహా ఇతర రాష్ట్రాల్లోని 6 స్థానాల ఉప ఎన్నికల బెంగాల్లోని సర్టిఫీ ఉప ఎన్నికలో టీఎంసీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో టీఎంసీ ఎంటరిగా పోటీ చేస్తుందని దీదీ చెబుతున్నారు. కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌తోనే కలిసి వెళ్తుందని తెలుస్తోంది. టీఎంసీ చీఫ్ మమత.. బెంగాల్‌లో మూడు సార్లు అధికారంలోకి వచ్చారు. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం టీఎంసీకి 20 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా టీఎంసీ పోటీ చేస్తే మోదీ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం. ఫలితంగా బీజేపీకే లాభం. మమత, కేజ్రీవాల్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి కాస్త నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ కష్టమే..
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే. దేశంలో వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దేనని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వెల్లడిం చారు. కానీ, కాంగ్రెస్ ఏయే పార్టీలకు నాయకత్వం వహిస్తుందన్నది ఇంకా తేలలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అప్పుడు ఆప్ స్పందించలేదు. తాజాగా సిసోడియాను లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దీనిని కాంగ్రెస్ ఖండించలేదు. దీంతో ఆప్, కాంగ్రెస్ పొత్తు కష్టమే అన్న అభిప్రాయం ఉంది. వివాదాలు సమసిపోవడానికి ఎవరూ చొరవ చూపడం లేదు. ఇక దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు న్న ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకం. ముఖ్యమైన రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు ఏకం కావాల్సి ఉన్నా.. ఎస్పీ నేతలు మాత్రం కాంగ్రెస్‌తో ఉన్నట్లు చెబుతున్నా.. సఖ్యత మాత్రం కనిపించడం లేదు. మేఘాలయ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ నేతలు రాహుల్ విమర్శించడం గమనార్హం.
విపక్షాలు ఏకమైతేనే ప్రభావం..
ఇక అసలు విషయం ఏంటంటే, రాహుల్, మమత, కేజీవాల్ ముగ్గురూ ప్రధాని కావాలనే ఆకాంక్షిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీతో సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. యూపీలోనూ కాంగ్రెస్, ఎస్పీ ఎడముఖం పెడముఖంలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మోదీని ఓడించాలంటే కాంగ్రెస్, ఆప్, టీఎంసీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ అవకాశం చాలా తక్కువ ఉందని ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. దీంతో ఈ ముగ్గురు కలిసే మోదీకి మరోమారు అధికారం కట్టబెడతారన్న అభిప్రాయం రాజకీయావర్గాల్లో వ్యక్తమవుతోంది.