YS Vijayamma: కొడుకా.? కూతురా? విజయమ్మ ఎటువైపు?

రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మ అందరికీ సుపరిచితం. భర్త ఉన్నంతవరకు ఆమె రాజకీయాల గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంతో పాటు పిల్లల కోసం ఆమె బయటకు రావాల్సి వచ్చింది.

Written By: Dharma, Updated On : January 23, 2024 1:28 pm

YS Vijayamma

Follow us on

YS Vijayamma: వైఎస్ విజయమ్మ పై ఒత్తిడి పెరుగుతోంది. ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. కానీ ఒక వైపు కుమారుడు జగన్.. మరోవైపు కుమార్తె షర్మిల.. ఎవరి వైపు అడుగులు వేయాలో తెలియక విజయమ్మ సతమతమవుతున్నారు. తటస్థంగా ఉండిపోవాలని చూస్తున్నారు. కానీ ఆమెపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఒత్తిడి పెరుగుతోంది. కుమార్తె షర్మిలతో పాటు రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కెవిపి రామచంద్ర రావు సైతం విజయమ్మను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె కానీ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. జగన్ కు ఇబ్బందికరమే.

రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మ అందరికీ సుపరిచితం. భర్త ఉన్నంతవరకు ఆమె రాజకీయాల గురించి ఆలోచించిన సందర్భాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంతో పాటు పిల్లల కోసం ఆమె బయటకు రావాల్సి వచ్చింది. తండ్రి అకాల మరణంతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ సిద్ధపడ్డారు. అందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు. ఆ సమయంలో తొలిసారిగా విజయమ్మ బయటకు వచ్చారు. నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. తన కుమారుడు జగన్ ఓదార్పు యాత్రతో పాటు రాజకీయ అంశాలకు సంబంధించి చర్చలు జరిపారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం నుంచి సానుకూలత రాలేదు. ఆపై కుమారుడు జగన్ పై కేసులు పెరిగాయి. 16 నెలల పాటు ఆయన జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే విజయమ్మ తన కుమారుడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైసిపి ఏర్పాటు వెనుక కీలక పాత్ర పోషించారు.

తన కుమారుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ వ్యవహరించారు. కానీ అన్నతో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించారు. దీంతో వైసిపి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన విజయమ్మ తెలంగాణలో కుమార్తె వెంట నడిచారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రాణించలేకపోయారు. అనూహ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఏపీలో విజయమ్మ పాత్ర ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది. అన్నకు ఎదురొడ్డి వెళ్లేందుకు షర్మిల డిసైడ్ అయ్యారు. రాజకీయ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటువంటి సమయంలో విజయమ్మను తన వెంట తీసుకెళ్లేందుకు షర్మిల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అయితే విజయమ్మ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు సంశయిస్తున్నట్లు సమాచారం. కుమార్తెకు అండగా నిలవాలని ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం కుమారుడికి వ్యతిరేకంగా మారాల్సి ఉంటుంది. అది కుటుంబానికి వాంఛనీయం కాదని.. తల్లి స్థానంలో ఉన్న తనకు అది తగదని విజయమ్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజశేఖర్ రెడ్డి ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు షర్మిలకు అండగా నిలుస్తున్నారు. అటు విజయమ్మ ను సైతం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా.. తాను తటస్థంగా ఉండేందుకే విజయమ్మ మొగ్గు చూపుతున్నారు. అయితే ఆమె అలానే ఉండిపోతారా? లేకుంటే ఒత్తిడితో కాంగ్రెస్ లో చేరుతారా? అన్నది తేలాల్సి ఉంది.