Jr NTR: ఉరిమే ఉత్సాహం.. కన్నీళ్లు పెట్టించేలా ఎమోషనల్.. మాటల్లో డ్యాన్సుల్లో ఫైర్..ఎనర్జీ అన్నీ కలిపితే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే అభిమానం ఎక్కువే ఉంటుంది. ఆయన నటన అంటే కుర్రాళ్లలో ఎక్కడా లేని ఎనర్జీ వస్తుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. యాక్టింగ్ తో అశేష ప్రేక్షకాభిమానాన్ని పెంచుకున్న ఎన్టీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఈరోజే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే హీరోగా వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కు మొదటి సినిమా కాదు. అంతకుముందే ఆయన బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు చిత్ర సీమలో 21 ఏళ్లలో ఎన్టీఆర్ 30 సినిమాల్లో నటించారు. ఈ సందర్భంగా ఆయన సీనీ కెరీర్ లో ఎన్నో మలుపులు.. అవేంటో ఒకసారి చూద్దాం..

నందమూరి తారకరామారావు మనువడు.. హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే రంగులు పూసుకున్నాడు. కెమెరా ముందు ఏమాత్రం బెరుకు లేకుండా నటించేశాడు. తాత ఎన్టీఆర్ నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షెన్ లో ఎన్టీఆర్ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బాలకృష్ణ కూడా నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తరువాత 1997లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో రాముడి పాత్రలో జీవించేశాడు. తొలి చిత్రం పౌరాణికంలో అద్భుతంగా నటించి నంది అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.
ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ 2001లో నవంబర్ 16న ‘నిన్ను చూడాలని’ సినిమా కోసం మొదటిసారి హీరోగా నటించాడు. ఈ సినిమా అనుకున్న విజయం సాధించకపోవడంతో ఏమాత్రం నిరాశ చెందలేదు. దీంతో అదే సమయంలో మంచి కాన్సెప్టుతో రెడీగా ఉన్న రాజమౌళి.. ఎన్టీఆర్ తో కలిసి ‘స్టూడెంట్ నెం.1’ సినిమా తీశారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘సుబ్బు’ కాస్త నిరాశ పరిచినా ‘ఆది’ సినిమాతో మాస్ హీరో అనిపించుకున్నాడు. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొట్టిన డైలాగ్ ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అన్న డైలాగ్ ఇప్పటికీ పాపులర్ గానే ఉంది. వివీ వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
అప్పటి వరకు ఎన్టీఆర్ మాస్ హీరో అనుకుంటున్న సమయంలో బి.గోపాల్ దర్శకత్వంలో ‘అల్లరి రాముడు’ లో కాస్త ఫ్యామిలీ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా యావరేజ్ గా నడిచింది. ఇక తరువాత నటించిన ‘నాగ’ నిరాశపరిచింది. రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ కోసం మరో కథ రెడీ చేసి ‘సింహాద్రి’ తీశాడు. అప్పడే ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ లభించింది. ఈ చిత్రంలో తారక్ మాస్, కామెడీ, యాక్షన్ లతో ఆల్ రౌండర్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.
అయితే ‘సింహాద్రి’ విజయం తరువాత ఎన్టీఆర్ కు ‘ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, వరుస ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో కృష్ణ వంశీ డైరెక్షన్లో ‘రాఖీ’ మరోసారి ఎన్టీఆర్ లోని నట బీభత్సాన్ని పైకి లేపింది. ఆ తరువాత ‘యమదొంగ’ నిరాశ పరిచినా ‘అదుర్స్’ కామెడీతో అలరించాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్ ’ నుంచి మళ్లీ ఎన్టీఆర్ హవా సాగింది. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజి’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ సినిమాలు వరకు వరుసగా విజయాలందుకున్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓవర్ నైట్ దేశమొత్తం తెలిసేలా ప్యాన్ ఇండియా హీరో కాబోతున్నాడు.