Nara Lokesh : లోకేషం శక్తి సామర్థ్యాలు మరోసారి బయటపడ్డాయి. లోకేష్ ను నవ్వుల పాలు చేశాయి. తన మాటల్లో తడబాటుతో నవ్వులపాలు కావడం నారా లోకేష్ కు కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో వచ్చీరాని భాషతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా నెల్లూరు జిల్లా యువగళం పాదయాత్రలో అడ్డదిడ్డమైన మాటలతో టీడీపీ అభిమానులు, ప్రజల సహనాన్ని పరీక్షించారు. ఒకే మాటను పదేపదే చెబుతూ వచ్చారు. తరువాత మాట మరిచిపోయి అభిమానులు అవాక్కయ్యేలా ప్రవర్తించాడు. చివరకు పేపరు చదివి ప్రామ్టింగ్ అందుకున్న మాదిరిగా ప్రసంగాన్ని కొనసాగించడంతో టీడీపీ నేతలు ‘హమ్మయ్య.. మా లోకేషం ఎలాగైనా ప్రసంగం పూర్తి చేశాడని’ నిట్టూర్చారు..
రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు దిగారు. అయితే పార్టీ వర్గాల్లో కూడా ఒకింత అనుమానం ఉండేది. లోకేష్ యాత్ర చేయగలరా? అంత దూరం నడవగలరా? ప్రజలతో మేమకం కాగలరా? అంతకు మించి ప్రసంగాల్లో రాటుదేలగలరా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా పార్టీ వర్గాల్లోనే ఒకరకమైన అనుమానాలుండేవి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేసి లోకేష్ పాదయాత్ర సాగిస్తున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్నారు.
146వ రోజు యాత్రలో భాగంగా లోకేష్ నెల్లూరు జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు. జగన్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల గాయాలపై కారం పూస్తోందని ఆరోపించే క్రమంలో బ్రహ్మానందం ఓ సినిమాలో నత్తి ప్రదర్శన తరహాలో తడబడ్డాడు… ‘రైతు గాయం కారం.. రైతు గాయంపై కారం.. రైతు గాయంపై కారం’ అంటూ అదే మాటను మూడుసార్లు చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగా ఏ పదం వాడాలో కూడా తెలియని తెలుగు భాషా పఠిమ మన లోకేషంది అని అక్కడున్న వారందరికీ అర్థమైపోయింది. చివరకు ఒక క్షణం అంటూ సభికుల అనుమతి తీసుకొని పేపర్ అందుకున్నారు. పేపరు చదివి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే లోకేష్ శైలి చూసి టీడీపీ నాయకులు భోల్లున నవ్వారు. ఆశ్చర్యంగా ఆయన వైపు బేలగా లోలోపల నవ్వుకుంటూ చూశారు. సభికులు సైతం లోకేష్ ప్రసంగానికి కడుపు చెక్కలయ్యేలా నవ్వేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి.