Lata Mangeshkar: సంగీత్ మే బైఠక్.. లతా మంగేష్కర్ కు పాటలతోనే నివాళి

లతా మంగేష్కర్ మరాఠీ శాస్త్రీయ గాయకుడు, నాటక రంగ కళాకారుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శేవంతి దంపతులకు ఇండోర్ లో లతా మంగేష్కర్ జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు యుక్త వయసులోనే ఆమె సంగీతంతో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 6, 2024 3:22 pm

Lata Mangeshkar

Follow us on

Lata Mangeshkar: “పాడనా కమ్మగా, తీయగా ఈ పాట.. పాటగా బతకనా మీ అందరి నోట”.. వాసు సినిమాలో వెంకటేష్ పడతాడు ఈ పాట.. సంగీతం అంటే ఇష్టం ఉన్న వ్యక్తిగా.. వర్ధమాన సంగీత కళాకారుడిగా.. పాట మీద తనకున్న ప్రేమను ఆ పాట రూపంలోనే వ్యక్తం చేస్తాడు. సరిగ్గా ఇలాంటి అభిమానాన్ని.. తమ గాత్రంతో వ్యక్తం చేశారు లబ్ద ప్రతిష్టులైన గాయని గాయకులు. ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని సంగీత్ మే బైఠక్ అనే పేరుతో పాటలు పాడుతూ ఆమెకు నివాళులర్పించారు. విఖ్యాత గాయనిగా లతా మంగేష్కర్ పేరుపొందారు. ఫిబ్రవరి 6 2022న లతా మంగేష్కర్ అనారోగ్యంతో కన్నుమూశారు. భారతీయ సినిమా రంగానికి సంబంధించి గొప్ప నేపథ్య గాయకులలో లతా మంగేష్కర్ ఒకరు. 1942లో అంటే ఆమెకు 13 సంవత్సరాల వయసున్నప్పుడు గాయనిగా తన కెరియర్ ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలలో ఆమె ఏకంగా 30 వేల పాటలు పాడారు.

సంగీత్ మే బైఠక్ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది కళాకారులు పాల్గొన్నారు. ఇండియన్ సింగర్స్ అండ్ మెజీషియన్స్ రైట్స్ అసోసియేషన్ స్థూలంగా ఐసమ్రా.. దాని వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్ టాండన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. లతా మంగేష్కర్ వర్ధంతి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆమె సోదరీమణులు ఆశాభోంస్లే, మంగేష్కర్ హాజరయ్యారు. ఆల్క యాగ్నిక్, ఉదిత్ నారాయణ్, కునాల్ గుంజ వాలా, సురేష్ వాడకార్, షాన్, సుదేశ్ భోంస్లే, షబ్బీర్ కుమార్, నితిన్ ముఖేష్, లలిత్ పండిత్, శైలేంద్ర సింగ్, సంజయ్ టాండన్, అన్నూమాలిక్, రిచా శర్మ, మధు శ్రీ, జస్పిందర్ నరులగం, టి ప్రముఖ కళాకారులు లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించేందుకు ఆమె పాడిన పాటలను ఆలపించారు. జావేద్ అక్తర్, ఆనంద్ జీ భాయ్, ప్యారే లాల్ జీ, విశాల్ భరద్వాజ్, హిమేష్ రేష్మియా వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లతా మంగేష్కర్ మరాఠీ శాస్త్రీయ గాయకుడు, నాటక రంగ కళాకారుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శేవంతి దంపతులకు ఇండోర్ లో లతా మంగేష్కర్ జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు యుక్త వయసులోనే ఆమె సంగీతంతో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆమె పాటలు పాడింది. బాలీవుడ్ లోని అనేక తరాల మహిళా నటులకు ఆమె గాత్ర దానం చేసింది. 1960_70 కాలంలో ఆమె కెరియర్ ఉచ్చ స్థితిలోకి వెళ్ళింది. అనిల్ బిశ్వాస్, శంకర్ జై కిషన్, నౌషాద్ అలీ, ఎస్డీ బర్మన్, శ్రీ రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యామ్, రవి, సజ్జాద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జి ఆనంద్ జి, మదన్మోహన్, ఉషా ఖన్నా వంటి గొప్ప సంగీత దర్శకులతో ఆమె పని చేశారు. వినూత్నమైన పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. మధుబాల, నిమ్మి, మీనా కుమారి, నర్గీస్, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, షర్మిల ఠాగూర్ వంటి నటులకు లతా మంగేష్కర్ గాత్రధానం చేసింది. తన సోదరి ఆశాభోంస్లే తో ఇక పాటలు పాడింది.. లగామంగేష్కర్ ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు కొద్ది రోజులపాటు పాటలు పాడలేకపోయారు. అయినప్పటికీ ఆమె కోలుకునేంతవరకు సుప్రసిద్ధ సంగీత దర్శకులు హేమంత్ కుమార్, మదన్ మోహన్ వంటి వారు ఎదురు చూశారు. ఆమె కోలుకున్న తర్వాత “బీస్ బాల్ బాద్, వో కౌన్ థీ, నైనా బర్సా” వంటి ప్రజాదరణ పొందిన పాటలను రికార్డు చేశారు. ఆ పాటలను వేరే గాయకులతో పాడించవచ్చు. కానీ లతా మంగేష్కర్ కోలుకునేంతవరకు వారు ఎదురుచూశారంటే ఆమె గాత్రం విలువ అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఆ పాటలు లతామంగేష్కర్ కెరియర్లో మైలురాళ్ళు గా నిలిచిపోయాయి.