Munugode Poll attempt to buy trs mlas : బీజేపీ నుంచి నేతలను లాగేస్తున్న టీఆర్ఎస్ కు షాకివ్వడానికి రెడీ అయిన ఓ ముఠా 100 కోట్లతో హైదరాబాద్ లో వాలింది. హైదరాబాద్ నగర శివారుల్లోని మొయినాబాద్ ఫాంహౌస్ లో తిష్టవేసింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ ఇచ్చింది. తాజాగా ఆ ఢిల్లీ ముఠా సభ్యులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు చేశారు. రూ.15 కోట్ల వరకూ నగదు పట్టుకున్నారు.

మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్ లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ఈ ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు డబ్బుల సంచులతో వచ్చినట్టు సమాచారం. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
మరి ఈ కొనుగోలుమాల్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి? ఢిల్లీ సభ్యులు ఏ పార్టీవారు? నిజంగానే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారా? అన్న విషయాలను సైబరాబాద్ కమిషనర్ కొద్దిసేపట్లో మీడియాకు వెళ్లడించనున్నారు. మునుగోడు ఎన్నికల వేళ ఏకంగా 100 కోట్ల చొప్పున ఒక ఎమ్మెల్యేను కొనేందుకు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.