Munugode By Election 2022: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలు దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. విశ్లేషకులు, రాజకీయ పార్టీల నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా మునుగోడు ఉప ఎన్నికలను భావిస్తున్న మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ గెలిచిన తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇందుకోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా డబ్బులు వెచ్చిస్తుండగా, కాంగ్రెస్ కాస్త వెనుకబడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మునుగోడు నియోజకవర్గ ఓటర్లు నిత్యం పండుగ చేసుకుంటున్నారు. నెల రోజుల్లోనే రూ.50 కోట్ల విలువైన మాంసం తిన్నారు. రూ.160 కోట్ల విలువైన మద్యం తాగేశారు.

మిగిలింది వారమే..
మునుగోడు ఉప ఎన్నికలకు ఇంకా వారం రోజులే ఉంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మునుగోడులో అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. నువ్వా నేనా అన్నట్లుగా.. ప్రతి ఓటరునూ కలుస్తున్నాయి. అక్కడ ప్రతిరోజూ మద్యం ఏరులై పారుతోంది. ప్రతి గ్రామంలో మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. తాగినోళ్లకు తాగినంత.. తిన్నోళ్లకు తిన్నంతలా ఉంది పరిస్థితి. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో అక్కడ మద్యం, మాంసం విక్రయాలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల పరిధిలో అక్టోబరు నెలలో 22వ తేదీ వరకు ఏకంగా రూ.చీ160.8 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల ముగిసేరికి రూ.230 కోట్లకు చేరే అవకాశముందని అంచనాలున్నాయి. అత్యధికంగా మునుగోడులో, అత్యల్పంగా గట్టుప్పల్‌లో మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో నల్గొండ జిల్లాలో నెలకు సగటున రూ.132 కోట్ల మద్యం అమ్మకాలు జరిగేవి. కానీ ప్రస్తుతం ఒక్క మునుగోడులోనే అందుకు రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయంటే.. అక్కడ ఏ స్థాయిలో మద్యం ఏరులై పారుతుందో అర్థం చేసుకోచ్చు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగే ఆత్మీయ సమ్మేళనాల విందులకు నగరం నుంచే మద్యం తీసుకొస్తున్నారు. అది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే.. లెక్కలు మరింతగా పెరుగుతాయి. మునుగోడుతో పరిధిలో జరిగే అమ్మకాలతోపాటు నగర శివారులో జరిగే సభలు, సమావేశాలకు హైదరాబాద్ నుంచి తరలించిన మద్యాన్ని కలుపుకుంటే… మునుగోడు ఎన్నికల కోసం ఈ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా.
పెరిగిన మాంసం అమ్మకాలు..
మునుగోడులో మాంసం అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చికెన్ షాప్‌ల నుంచి క్వింటాళ్లకు క్వింటాళ్లు మాంసం వెళ్తోంది. మునుగోడులో మోహరించిన నాయకులు, కార్యకర్తలకు రోజూ రెండు పూటల మాంసాహార భోజనమే పెడుతున్నారు. గ్రామస్తులకు కూడా విందు ఇస్తున్నారు. ప్రతీ గ్రామంలోనూ చికెన్, మటన్ వినియోగం మూడు నాలుగింతలు పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలు కలిసి.. మాంసం కోసం ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. గతంలో రోజుకు 50 కిలోలు అమ్మే చికెన్ షాపులు సైతం.. ఇప్పుడు 400 కిలోల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఉపఎన్నికల పుణ్యమా? అని చికెన్,మటన్ వ్యాపారులకు భారీగా ఆదాయం వస్తోంది. నల్గొండ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, నాగర్ కర్నూల్ నుంచి మునుగోడుకు ప్రతీరోజు 40 వాహనాల్లో మేకలను తీసుకొస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో మద్యం, మాంసం విక్రయాలు మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.

ఓటర్లకు పండుగ..
ఇక మునుగోడు ఉప ఎన్నికల పుణ్యమా అని ఓటర్లు నెల రోజులుగా పండుగ చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంట్లో నిత్యం నీసు కూరే. అయితే మటన్.. లేదంటే చికన్. ఇక మద్యం అదనం. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నాయకులు తమ నేత గెలుపు కోసం ఇంటింటికీ మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియగానే డబ్బులు పంచేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఈమేరకు ఇప్పటికే నోట్ల కట్టలు నియోకవర్గానికి చేరుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు స్వతంత్య్ర భారత దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.