
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ శరవేగంగా సాగుతోంది. కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు గుజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్నారు. తాజాగా సుప్రీం కోర్టు కొత్త సిట్ ఏర్పాటుచేసిన తరువాత ఉదయ్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి వరకూ దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ ను సుప్రీం కోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ కొత్తగా డీఐజీ కేశవ్‌రామ్ చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇందులో… ఎస్పీ వికాస్ కుమార్, అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పుణియ, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్‌ను సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో విచారణ మళ్లీ మొదటికి వచ్చిందన్న టాక్ వినిపించింది.
గతంలో పలుమార్లు విచారణ
గుజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఆయన్ను గతంలోనే సీబీఐ పలుమార్లు విచారించింది. ఇప్పుడు ఏకంగా అదుపులోకి తీసుకొని విచారిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివేకా హత్య జరిగిన నాడు అవినాష్, శివశంకరరెడ్డితో పాటు ఉదయ్ కూడా ఘటనా స్థలానికి వెళ్లినట్టు సీబీఐ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఆ రోజు ఎంపీ అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి ఇంట్లోనే ఉదయ్ ఉన్నట్టు గూగుల్ టెక్ ద్వారా గుర్తించినట్టు తెలుస్తోంది. పులివెందుల నుంచి కడప జైలు గెస్ట్ హౌస్ కు తీసుకొని వెళ్లి ఉదయ్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన నాడు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ దే యాక్టివ్ రోల్ అని సీబీఐ గుర్తించినట్టు సమాచారం. వివేకా తండ్రి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్టినట్టు కూడా తెలుస్తోంది.

అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ వెనక్కి తీసుకున్న వేళ…
అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడ్ని అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి సరిగ్గాతన ముందస్తు బెయిల్ పిటీషన్ ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ మంచి దూకుడు మీద ఉండడం.. కీలక అరెస్టులు ఉంటాయని ప్రచారం జరగడంతో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేశారు. కానీ ఏకంగా సిట్ ను మార్చుతూ కోర్టు ఆదేశాలివ్వడంతో బెయిల్ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే సీబీఐ కఠిన చర్యలను నియంత్రించాలని తొలుత అవినాష్ రెడ్డి పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాలని.. సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగింది. అందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దానిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ప్రధాన అనుచరుడ్ని అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది.