MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫలితాలు వెలువడి విజేతలు ఎవరో తేలిపోయింది. ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడకముందే ‘మా’లో ముసలం మొదలైంది. ఒక్కరొక్కరుగా రాజీనామాల బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి ముందుకు సాగిపోయేవారు. లేదంటే మౌనంగా ఉండిపోయేవారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రాజీనామాలతో ‘మా’ ఉంటుందా? చీలిపోతుందా? అన్నది సందేహంగా మారింది.

ప్రతిసారి ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా నాగబాబు కింగ్ మేకర్ గా నిలిచేవారు. ఆయన సపోర్టు చేసిన వారు గెలిచేవారు. పోయిన సారి కూడా శివాజీరాజాను కాదని ‘నరేశ్’కు సపోర్టు చేసి మెగాబ్రదర్ నాగబాబు గెలిపించుకున్నారు. కానీ ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానెల్ వెనుక బాసటగా నిలిచి అన్నీ తానై లాబీయింగ్ చేసినా ఆయన్ను గెలిపించలేకపోయారు. ఈ క్రమంలోనే నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’కే రాజీనామా చేసేశారు.
‘ప్రాంతీయవాదం , సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేకనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు’ నాగబాబు సంచలన ప్రకటన చేశారు.
ఇక ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకాష్ రాజ్ ‘మా’కు రాజీనామా చేశారు. కేవలం నాగబాబు సపోర్టు చేసినంత మాత్రాన.. ఆయన ఒక్క ఓటుతో తాను గెలవను కదా.. అందరు మా సభ్యులు ఓటేయలేదని.. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళుతున్న ‘మా’లో కొనసాగలేనని.. అందుకే తాను సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తెలుగు సినిమాల్లో నటిస్తాను తప్పితే ‘మా’లో సభ్యుడిగా ఉండనని ప్రకాష్ రాజ్ మీడియా ముందు ప్రకటించారు. ఇక అసలు కథ ఇప్పుడే మొదలైందని ఆయన సమావేశం చివరలో వ్యాఖ్యానించి సంచలనానికి తెరతీశారు.
ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ చూశాక.. అసలు కథ ఇప్పుడే మొదలైందని తెలుస్తోంది. ఈ మాటల ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ‘మా’కు ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ప్యానెల్ నుంచి గెలిచిన వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు గందరగోళంగా మారింది. వీరిని అనుసరిస్తూ మిగతా వాళ్లు కూడా ‘మా’ పదవులకు రాజీనామా చేస్తారా? లేక కొత్త కార్యవర్గంలో కొనసాగుతారా? అన్నది సందేహంగా మారింది. అందరూ రాజీనామా బాట పడితే ‘మా’ చీలిపోవడం ఖాయం. అదే జరిగితే ‘మా’ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఒకవేళ ప్రకాష్ రాజ్ వర్గం నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేస్తే ‘మా’ ఎన్నికల ప్రక్రియ గందరగోళంలో పడుతుంది. ‘మా’లో ముసలం మొదలవుతుంది. ఇక ఎంత మంది రాజీనామా చేస్తారో.. అసలు ‘మా’ ఉంటుందా? కొనసాగుతుందా? అన్న సందేహాలు మొదలవుతున్నాయి.
ఇక మంచు విష్ణు అన్నట్టు తెలుగు సినిమాల్లో నటించాలంటే ‘మా’ సభ్యత్వం తప్పనిసరి అని సవరణ తీసుకొచ్చినా.. ‘మా’ అధ్యక్షుడిగా తెలుగువారే ఉండాలని బైలాస్ సవరించినా పెద్ద వివాదమే చెలరేగుతుంది.
ఇక మా ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఓటేసిన వారికి అవకాశాలు ఇవ్వకపోయినా అదో పెద్ద వివాదంగా మారడం ఖాయం. ఇక అందరూ వైదొలిగితే సినీ ఇండస్ట్రీలోని వివాదాలు కూడా ‘మా’ పరిష్కరించలేదు. ఇలా ‘మా’ ఎన్నికల చుట్టూ బోలెడు వివాదాలు అల్లుకొని ఉన్నాయి. వాటిని కొత్త కార్యవర్గం ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తిగా మారింది.