BRS Khammam Meeting: 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కడుపు నిండా నీళ్లు తాగలేకున్నాం. మూడు పూటల అన్నం తినలేకున్నాం. విశాలమైన వ్యవసాయ భూమి ఉంది. సమృద్ధిగా నీరు ఉంది. కానీ కెనడా నుంచి కంది పప్పు, పొరుగు దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. మిగులు కరెంట్ ఉన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఇంతటి దుస్థితి ఈ దేశానికి ఎందుకు పట్టింది. ఇలాగే కొనసాగుదామా ? మార్పు కోరుకుందామా ? అంటూ బీఆర్ఎస్ ఖమ్మం సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గర్జించారు. 2024 ఎన్నికలకు సమర శంఖం పూరించారు.

ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. వంద ఎకరాల్లో ఐదు లక్షల మందితో సభ నిర్వహించారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఐ నేత డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ విధివిధానాలను, రాజకీయ వ్యూహాలను కేసీఆర్ సవివరంగా చెప్పుకొచ్చారు.
దేశంలో 70 వేల టీఎంసీలు నీరు ఉందని, కేవలం 19 నుంచి 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. వేల టీఎంసీలు సముద్రం పాలౌతున్నాయని, ఇంతటి దౌర్భాగ్యం దేనికని ప్రశ్నించారు. చెన్నై నగరం తాగు నీటి కోసం నోరు తెరుచుకుని ఎదురుచూసే పరిస్థితి ఉందని, రాష్ట్రాల మధ్య జలవివాదాలతో కేంద్రం చోద్యం చూస్తోందని విమర్శించారు. వివిధ దేశాల్లో నదుల పై వేలాది టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్టులు కడితే.. మన దేశంలో ఒక్క నది మీద కూడ భారీ ప్రాజెక్టు కట్టిన పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఒకపక్క వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటే.. మరోపక్క నీళ్ల కోసం ఇరుగుపొరుగు రాష్ట్రాలు కొట్లాడుతున్న పరిస్థితి ఉందన్నారు. చాట్లోకి తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు కేంద్రం విధానం ఉందని తెలిపారు. పాలకుల జలవిధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. జలవివాదాల పరిష్కారం కోసం వేసే ట్రిబ్యునళ్ల తీర్పులు రావాలంటే ఏళ్లు గడిచినా రావడం లేదని, తీర్పులు వచ్చేదెప్పుడు ? ప‌్రాజెక్టులు కట్టెదెప్పుడని ప్రశ్నించారు.
దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే.. ప్రస్తుతం వినియోగిస్తోంది 2.10 లక్షల మెగావాట్లని చెప్పారు. ఇంత మిగులు విద్యుత్ ఉన్నా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన రావడంలేదని విమర్శించారు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలో దళిత బందు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మిషన్ భగీరథను దేశమంతా విస్తరిస్తామని, వెలుగు జిలుగుల భారత్ ను సాధించడమే బీఆర్ఎస్ లక్ష్యంగా కేసీఆర్ ప్రకటించారు.

అమెరికా, చైనాలతో పోల్చితే ఇండియాలో వ్యవసాయయోగ్యమైన భూమి ఎక్కువగా ఉందని, దీన్ని ఉపయోగించి ప్రపంచానికే ఫుడ్ చైన్ గా భారతదేశాన్ని మార్చవచ్చని కేసీఆర్ తెలిపారు. ఇంతటి అవకాశాలు దేశంలో ఉంటే ఇప్పటికీ కెనడా నుంచి కందిపప్పు, ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడం ఈ దేశ దౌర్భాగ్యం కాక ఇంకేంటని ప్రశ్నించారు. ఎల్ఐసీని ఎప్పుడెప్పుడు అమ్మాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలో వస్తే ఎల్ఐసీని ప్రభుత్వమే స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. మోదీది ప్రైవేటైజేషన్ అయితే.. కేసీఆర్ ది నేషనలైజేషన్ అని ప్రకటించారు.
విమానాలు, రైళ్లు, వ్యవసాయం అన్నింటినీ పెట్టుబడిదారులకు అప్పగించి.. తమ పొలాల్లో తామే జీతం ఉండే పరిస్థితి రైతులకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని కేసీఆర్ విమర్శించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు బీజేపీ, కాంగ్రెస్సే కారణమన్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ దేశాన్ని బ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. 2024లో మేం ఢిల్లీకి.. మోదీ ఇంటికంటూ కేసీఆర్ సమరశంఖం పూరించారు.