Ghulam Nabi Azad: రాజకీయాలనేవి ఎప్పుడూ చిత్రంగానే ఉంటాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎప్పుడూ ఉండరు. ప్రత్యర్ధుల ఆట కట్టించడమే అసలైన రాజకీయం కాబట్టి.. ఇప్పుడు అదే ప్రక్రియను మోది అవలంబిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో మూడో స్థానాన్ని అనుభవించిన ఆజాద్.. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెళ్తూ వెళ్తూ సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లిపోయారు. ఇలానే ఉంటే కాంగ్రెస్ అనే పార్టీ మనుగడలో ఉండదంటూ శాపనార్ధాలు పెట్టి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గులాం నబి ఆజాద్ ఇప్పుడు అకస్మాత్తుగా స్వరం పెంచడం పట్ల రాజకీయ వర్గాల్లో పలు చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నది మోడీ అని క్లియర్ కట్ గా తెలుస్తోంది.

..
దెబ్బకు రెండు పిట్టలు
..
జమ్ము కాశ్మీర్ అనేది ఒక రావణ కాష్టం. ఉగ్రవాదుల దాడులు, ప్రజల ఇబ్బందులు అక్కడ నిత్య కృత్యం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక పార్టీ అక్కడ పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించలేదు. ఫరూక్ అబ్దుల్లా లేదా ముఫ్తి మహమ్మద్ సయ్యద్.. ఇలా ఎవరో ఒకరి అండ లేకుండా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అంతెందుకు అంతటి కాకలు తీరిన మోడీ కూడా దీనికి అతీతుడు ఏమీ కాదు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కొద్దో గొప్పో మెజారిటీ సాధించింది. ముఫ్తి మహమ్మద్ సయ్యద్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అది మూన్నాళ్ళ ముచ్చట అయింది. ఇక గత్యంతరం లేక ఆర్టికల్ 370 ని రద్దు చేశాడు. ఫలితంగా ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తి మహమ్మద్ సయ్యద్ కుటుంబాలకు రాజకీయ మనుగడ అనేది లేకుండా చేశాడు. అయినప్పటికీ మోడీకి పక్కలో బల్లెంలా గులాం ఆజాద్ ఉండనే ఉన్నాడు. ఎప్పుడైనా కాశ్మీర్లో ఇతని నుంచి బిజెపికి ప్రమాదం ఉంటుందని భావించి వెంటనే అతనితో సంధి మార్గానికి సంకేతాలు ఇచ్చాడు. ఇదే సమయంలో రామ్ నాథ్ కోవింద్ తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిగా గులాం నబి ఆజాద్ ను ప్రకటిస్తారని సంకేతాలు ఇచ్చారు. అప్పటి నుంచే ఆజాద్ కాంగ్రెస్ కు దూరం జరగడం ప్రారంభించారు. రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన చింతన్ శిబిర్ లోనూ నిరసన ప్రకటించారు.
..
కాశ్మీర్ లో పాగానే లక్ష్యం
..
ఆజాద్ ను కాంగ్రెస్ కు దూరం చేశాక మోదీ ప్లాన్ బీ అమల్లో పెట్టారు. వెను వెంటనే ఆజాద్ ను రాజీనామా చేసేలా ప్రోత్సహించారు. ఇందుకు కాశ్మీర్ సీఎం పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో ఆజాద్ నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. వెళ్తూ వెళ్తూ సోనియా, రాహుల్ పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ తో భేటీ అయ్యారు. కాశ్మీర్ లో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలో చర్చించారు. అనంతరం విలేకరులతో అమీన్ భట్.. గులాం నబీ ఆజాద్ కాశ్మీర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాము బీజేపీ కి బీ టీమ్ కాదని మనసులో మాట చెప్పారు. త్వరలో భట్ కూడా బీజేపీ లోకి వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రతిపక్షాలను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న మోదీ.. ఇప్పుడు కాశ్మీర్ పై ఫోకస్ చేశారు. వెంటనే అక్కడ ప్రకంపనలు మొదలయ్యాయి. అన్నట్టు కాశ్మీర్ పండిట్లు మేం జమ్ము వెళ్లిపోతామని ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేసిన బిజెపి.. పండిట్ల గొడవ పై కిక్కురుమనడం లేదు. సరిగ్గా ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మోదీ గులాం నబీ భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ వైపు ఎక్కు పెట్టాడు. ఇప్పటికే కాంగ్రెస్ బలహీనం అవుతోంది. ఈ పరిణామంతో మరింత కుంగి పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ చుక్కాని లేని నావ!