TRS vs Modi : అందరూ అనుకున్నట్టుగానే మోదీ రామగుండం సభకు కేసిఆర్ రాలేదు. కేవలం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా స్వాగతం చెప్పించారు. గతంలో మూడుసార్లు హైదరాబాద్ మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ఇలాగే చేశారు. మోడీ పర్యటనకు నాలుగు రోజుల ముందు నుంచే తన సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం కొనసాగించారు. గతంలోనూ ఈ తంతు జరిగిందే. ఇక మోదీ కూడా టిఆర్ఎస్ ను ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. కానీ ఈ సారి తన స్వరాన్ని తీవ్రం చేశారు. కెసిఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణకు మేలు
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తో ఉపాధి అవకాశాలు వస్తాయని, ఫెర్టిలైజర్ ప్లాంట్, రైల్వే లైన్, రోడ్ల విస్తరణ తెలంగాణకు మేలు చేస్తాయని మోదీ వివరించారు. అయితే మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం విశేషం. తెలంగాణ రైతులు, సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది సంవత్సరాల లో మౌలిక సదుపాయాల కే అధిక ప్రాధాన్యత ఇచ్చామని మోడీ స్పష్టం చేశారు. తమ పాలనలో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. శంకుస్థాపనలకు పరిమితం కాకుండా పనులు వేగంగా పూర్తి చేసామని తెలిపారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ సంస్కరణలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టామని, ఎరువుల కొరత లేకుండా అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతుల సంక్షేమం కోసం 10 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని మోదీ కుండ బద్దలు కొట్టారు.
-మాపై దుష్ప్రచారం
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించాల్సిన అవసరం బిజెపికి లేదని మోడీ వివరించారు.. కేంద్రంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తప్పు పట్టారు.. సింగరేణి సంస్థలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు. మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే కేంద్రం ఎలా విక్రయిస్తుంది అని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తామంటూ హైదరాబాద్ నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని, ఈరోజు హైదరాబాదులో ఉన్న వాళ్లకు నిద్ర పట్టదని మోదీ చలోక్తి విసిరారు.
సింగరేణి ప్రైవేటీకరణపై టీఆర్ఎస్ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరూ కేంద్రాన్ని నిలదీస్తున్న వేళ మోడీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనమైంది. కేంద్రంలోని అన్ని సంస్థలను ప్రైవేటీకరిస్తున్న మోడీ సింగరేణిని మాత్రం చేయమని చేయడంతో కార్మిక వర్గం ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పటికైనా సింగరేణి కార్మికులు, టీఆర్ఎస్ నోళ్లకు మూతలు పడడం ఖాయం.