Marriage problem for men ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు భార్యలను చేసుకున్న సమాజం మనది. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి నుంచి మన సూపర్ స్టార్ కృష్ణ వరకూ మన సమాజంలో ఇద్దరు భార్యల ముద్దుల మొగ్గుళ్లు ఉన్నారు.. గల్ఫ్ దేశాలు.. కొన్ని ముస్లిం కుటుంబాల్లోనూ ఇద్దరేసి భార్యలను కట్టుకున్న వారు ఎందరో.. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితాన్ని రివర్స్ చేస్తుంటుంది. ఇప్పుడూ అదే చేసింది. 90వ దశకంలో పెద్ద ఎత్తున ఆడపిల్లలు వద్దంటూ భ్రూణ హత్యలు జరిగాయి. ఇప్పుడు ఆ బాధను సమాజం అనుభవిస్తోంది. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి పిల్లను ఎవరూ ఇవ్వడం లేదు. నాడు ఆడపిల్లలను కడుపులోనే చిదిమేసి అబ్బాయిని కన్నవారికి ఇప్పుడు అమ్మాయి దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక పిల్ల దొరికినా బడా బాబులకు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డవారికి.. మంచి వ్యాపారాలు డబ్బు ఉన్నవారికే ఇస్తున్నారు. సాదాసీదా రైతు కుటుంబాలు, చిన్న ఉద్యోగాలు, నెలసరి చిన్న జీతాలు గల వారికి పెళ్లిళ్లు కావడం లేదు.. పిల్లను ఎవరూ ఇవ్వడం లేదు. బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాల్లో అయితే కన్యాశుల్కం వచ్చేసింది. అందులో పుట్టిన అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
అబ్బాయిలకు అమ్మాయి దొరకడమే ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది. పెళ్లిళ్ల పేరయ్యాలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఒక్కో పెళ్లి సెట్ చేయాలంటే 30వేల నుంచి 50వేలు తీసుకుంటున్నారు. మామూలు కుటుంబాల్లోని మధ్యతరగతి యువకులకు అస్సలు పిల్ల దొరకని పరిస్థితి. అందరూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకే పిల్లను ఇస్తున్నారు. మామూలు పనిచేసేవారు.. వ్యవసాయం చేసేవారికి పిల్లను ఎవ్వరూ ఇవ్వడం లేదు.
దేశవ్యాప్తంగా చూసుకున్నా ఇదే పరిస్థితి. ఆడవాళ్లకంటే మగవాళ్లు అధిక సంఖ్యలో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు పెళ్లి కావడం లేదనే మానసిక ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వెల్లడించింది. మంచి స్థాయిలో ఉన్న అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు భావించడమే ఇందుకు కారణం.
2021లో 2647 ఆత్మహత్యలు నమోదు కాగా.. అందులో 61 శాతం మంది మగవారు ఉన్నట్టు సమాచారం. దీంతో పెళ్లి కాలేదు.. కాదు.. అన్న భావన పురుషులను ఇలా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. సమాజంలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండడం.. అమ్మాయిల సంఖ్య సరిపడా లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.. పాతికేళ్ల క్రితం ఆడబిడ్డలను కడుపులో చంపిన పాపం ఇప్పుడు కొడుతోంది.