AP Online Ticketing: ఏపీలో ఇష్టారాజ్యంగా నడుస్తున్న సినిమా టికెట్ వ్యవస్థను ఓ దారికి తేవడానికి జగన్ సర్కార్ నడుం బిగించి తీసుకొచ్చిందే ‘ఆన్ లైన్ టికెటింగ్’ వ్యవస్థ. ఈ క్రమంలోనే ప్రభుత్వమే ఈ టికెటింగ్ వ్యవస్థను నిర్వహించాలని అనుకున్నా అది సాధ్యపడకపోవడంతో టెండర్లు పిలిచింది. కాంట్రాక్ట్ ఇచ్చిన పోర్టల్ మాత్రమే ఏపీలోని అన్ని థియేటర్లలో టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మేలా కొత్త చట్టం కూడా చేశారు.

ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ టికెట్లు అమ్మడానికి నిర్ణయించారు. కానీ దీనికి సొంత వెబ్ సైట్, యాప్స్ లేవు. నిర్వహణ కూడా అంత ఈజీ కాదు. అంత మానవ వనరులు, టెక్నాలజీ ఏపీ ప్రభుత్వ సంస్థ వద్ద లేదు. అందుకే ఇప్పటికే మార్కెట్లో ఉన్న పోర్టళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేశ్ సంస్థ ‘జస్ట్ టిక్కెట్స్’ ఎల్1గా ఎంపికైనట్లు సమాచారం.
ఇక జస్ట్ టిక్కెట్ తోపాటు బుక్ మై షో కూడా ఈ టెండర్లలో పాల్గొంది. కానీ తక్కువ సర్వీస్ చార్జీ తీసుకునేందుకు జస్ట్ టికెట్ కొటేషన్ వేయడంతో ఎల్1గా నిలిచింది. ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ గెట్ వేగా కాంట్రాక్ట్ ఇవ్వడానికి సీఎం జగన్ సర్కార్ రెడీ అయ్యింది. ఏపీలోని థియేటర్లలో బుకింగ్ లు అన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ ఆన్ లైన్ టికెటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజులైనా ఇంకా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఏం జరుగుతోందన్న చర్చ టాలీవుడ్ లో మొదలైంది.
ఏపీ ఆన్ లైన్ టికెట్ల కాంట్రాక్ట్ కోసం జస్ట్ టికెట్ తోపాటు బుక్ మై షో కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. బుక్ మై షో తాజాగా జస్ట్ టికెట్ కన్నా తక్కువ కమిషన్ తీసుకుంటామని రివర్స్ టెండరింగ్ వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం మెగా ఫ్యామిలీ సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సంస్థలతో చర్చలు జరుగుతున్నట్టు వినికిడి.
టెండర్లను నిబంధనల ప్రకారం తక్కువ కోట్ చేసే వారికే ఇవ్వాలి. లేదంటే గిట్టుబాటు కాకుంటే టెండర్లు రద్దు చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. చూస్తుంటే మెగా ఫ్యామిలీ సంస్థకు షాకిస్తూ కార్పొరేట్ సంస్థకు ఏపీ ఆన్ లైన్ టికెటింగ్ ను మంచి ధరకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే టాలీవుడ్ వాళ్లకే ఇస్తే లాభం అని.. దాంతో ఏపీ ప్రభుత్వానికి మంచిదని అక్కడి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందట.. అందుకే ఈ ఆన్ లైన్ గొడవపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం.