MAA Elections: ఇల్లు అలకగానే పండుగ కాదు..‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’లో ఎలాగోలా గెలవగానే అధికారం సొంతమైపోదు.. అందరూ ఏకీభవించకపోరు.. అన్నట్టుగా తయారైంది ఇప్పుడు మంచువిష్ణు పరిస్థితి. గెలుపు సంబరాల్లో ఉన్న ఆయనకు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ వర్గం షాకిచ్చింది.మూకుమ్ముడి రాజీనామాలో మంచు విష్ణును డిఫెన్స్ లో పడేసింది. ఈ పరిణామం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అనూహ్య మలుపు తిరిగాయి. రాజకీయ ఎన్నికలను మించి ఎపిసోడ్ లు సాగుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. అయితే ఎన్నికల పక్రియ పూర్తయ్యాక కూడా ‘మా’లో రచ్చ జరుగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో, ప్రచారంలో తమపై చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచిన 11 మంది సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారని తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఇంకా అధ్యక్ష పదవి చేపట్టని మంచు విష్ణు ముందు రెండే రెండు మార్గాలున్నాయని కొందరు అనుకుంటున్నారు. ‘మా’ కొత్త అధ్యక్షుడు విష్ణుకు ఇప్పుడు ఇదీ పెద్ద సవాల్ గా మారింది. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించబోతున్నాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు 101 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల నిర్వహణ సమయంలో తమను ఇబ్బందులకు గురి చేశారని, తాము ఈ అసోసియేషన్లో పనిచేయలేమని మంగళవారం ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేశారు. అంతముందు తనను తెలుగోడు కానందుకు తన ఆత్మగౌరవం దెబ్బ తిన్నదని, అందువల్ల తాను అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నానని ప్రకాష్ రాజ్ వైదొలిగారు. ఆ తరువాత నిన్న ప్రెస్ మీట్ లో తన ప్యానల్ లో గెలిచిన వారు సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
‘మా’ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ఇరు వర్గాల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను తొలగించేలా అసోసియేషన్ నడుచుకోవాని ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే సినీ ఇండస్ట్రీలోని పెద్దలు కూర్చొని ముందుగా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారు. ఒక దశలో తనను మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోమన్నట్లు చిరంజీవి చెప్పారని మంచు విష్ణు ఇటీవల ప్రకటించారు. అయితే సినీ ఇండస్ట్రీ కోసం తాను పనిచేస్తానని మేనిఫెస్టో విడుదల చేసి మరీ పోటీ చేశారు. మొత్తంగా విష్ణు సామధాన భేద దండోపాలు ఉపయోగించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అయితే విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అసోషియేషన్లో తీవ్ర రచ్చ సాగుతోంది. నాగబాబుతో మొదలైన రాజీనామాల పర్వం ఎన్నికైన ప్యానల్ సభ్యులు సైతం తమ పదవులను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. ఇప్పటి వరకు ఒక్క రాజీనామా ఆమోదించకపోయినా వారితో ఎలా సంప్రదింపులు జరుపుతారోనని అనుకుంటున్నారు. అయితే వారిని బుజ్జగిస్తారా..? లేక నేరుగా ఢీకొంటారా..? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇంకో రెండో అప్షన్.. మోహన్ బాబు రంగంలోకి దిగడం. సినీ పెద్దలందరినీ కూర్చొబెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పటికే పెద్దలను వదిలి ఈ వివాదం మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఎప్పటికప్పుడు మీడియా ఈ విషయంపై ఫోకస్ చేస్తోంది. దీంతో బహిరంగంగానే అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తారోనని అనుకుంటున్నారు. గత ఆరు నెలలగా ఇండస్ట్రీలో మొదలైన రచ్చ ఎన్నికల ప్రక్రియ పూర్తయినా వివాదం సద్దుమణగడం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారానికి మోహన్ బాబు లేదా విష్ణు ఎవరు ముందడుగు వేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ప్రకాశ్ రాజ్ ఆధ్వర్యంలో మరో అసోసియేషన్ పెడతారని చర్చ జరుగుతోంది. దీంతో ఇండస్ట్రీ రెండు వర్గాలు విడిపోతుందా..? అని అనుకుంటున్నారు. ఎన్నికల్లో తామంతా ఒక్కటేనని అని చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని ఈ వివాదంతో తేలింది. అయితే మంచు విష్ణు ఎన్నికపై జీర్ణించుకోలేకే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్ ముందే ఎదురైందని అనుకుంటున్నారు. ఏ ‘మా’ సంఘం కోసం పంత పట్టి గెలుపొందారో ఇప్పుడు ఆ సంఘాన్ని లేకుండా చేయబోతున్నారట ప్రకాష్ రాజ్, మెగా ఫ్యామిలీ వర్గాలు.. ఇప్పుడు సంఘం లేనిది.. సభ్యులు లేని మంచు విష్ణు ఎలా ఊరేగుతారన్నది ప్రశ్న.. విష్ణు ను డిఫెన్స్ లో పడేసేలా సేచిన ఈ ప్రకాష్ రాజ్ వ్యూహాన్ని ఎలా అధిగమిస్తారన్నది వేచిచూడాలి. దీంతో విష్ణుకు ముందుంది ముసళ్ల పండుగంటున్నారు.