MAA Elections: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉండాలని ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ కు చాలాకాలంగా ఏకగ్రీవంగానే సభ్యులు ఎన్నికవుతున్నారు. గత మూడు పర్యాయాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి పోటీ తీవ్రమవడంతో సభ్యుల ప్రచారం, ఆరోపణ, ప్రత్యారోణలు ఉత్కంఠను రేపాయి. ఏదీ ఏమైనా ఈనెల 10న ఎన్నికలు జరగగా విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది సభ్యులు సైతం ‘మా’లో ఎన్నికవ్వడం విశేషం. ఇదే ఇప్పుడు మళ్లీ రెండు వర్గాల మధ్య గొడవలకు కారణమైంది. ఎన్నికలు ముగిసినా అసోసియేషన్ విషయంలో ఇంకా రాద్ధాంతం జరుగూతూనే ఉంది.

తాజాగా ప్రకాశ్ రాజ్ తో పాటు తన ప్యానల్ లో గెలిచిన సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. విష్ణు, మోహన్ బాబుపై ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో మోహన్ బాబు ప్రవర్తనపై తాము కలత చెందామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. బెనర్జీ అనే నటుడు అయితే మోహన్ బాబు తనను బూతులు తిట్టారని వలవల ఏడ్చేశారు.. సమీర్, ఇతర సభ్యులు సైతం మోహన్ బాబు దూకుడుగా వ్యవహరించారని అన్నారు. దీనికి నిరసనగా తాము రాజీనామా చేస్తున్నామని గెలిచిన 11 మంది ఈసీ సభ్యులు ప్రకటించారు. అయితే వీరి రాజీనామాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఎన్నికలన్నాకా.. ఇరువర్గాల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి అది తీవ్రమైంది. సినీ పెద్దలంతూ ఏకగ్రీవానికే మొగ్గు చూపినా పోటీతోనే న్యాయం జరుగుతుందని మోహన్ బాబు తమ కుమారుడు విష్ణును బరిలోకి దించారు. ఆ తరువాత ఎవరు చెప్పినా వెనుకడుగు వేయలేదు. అయితే ఎన్నికల ప్రక్రియలో ఎన్ని అవకతవకలు జరిగినా మొత్తంగా విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇక ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కొందరు నటుల ప్రవర్తన అందరినీ ఆలోచింపజేశాయి.
విష్ణు అధ్యక్షుడైన తరువాత ప్రకాశ్ రాజ్ మొదట రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తనను తెలుగోడు కానందుకు తాను అసోసియేషన్లో ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సినిమాల్లో నటిస్తాను కానీ అసోసియేషన్లో పనిచేయలేని ప్రకటించారు. అయితే ప్రకాశ్ రాజీనామాతో ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ తరువాత గెలిచిన 11 మంది సభ్యులు కూడా మోహన్ బాబు ప్రవర్తనపై తాము అసోసియేషన్లో ఉండలేమని అంటున్నారు. వీరి చర్చపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా.. తమకు ఏదో న్యాయం చేస్తారని కొందరు సభ్యులను గెలిపిస్తే ఇదేం రాజకీయం..? అని ఓటేసిన సినీ కళాకారులు విమర్శిస్తున్నారు. ఎన్నికలు ముగియగానే తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్న ప్రకాష్ రాజ్ సభ్యులు.. వీరికి ఓటేసిన వారి ఆశలు, ఆకాంక్షలను పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజీనామా చేసి కాడి వదిలేశారు. తమకు జరిగిన అవమానం గురించే చింతిస్తున్నారు తప్పితే తమకు ఓటేసిన వారి సమస్యలు తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదు. తమ సమస్యలను నిలదీస్తారని అనుకుంటే వారి వ్యక్తిగత ఎజెండాను ముందు పెడుతున్నారని ఓటేసిన సభ్యులు వాపోతున్నారు. ఈ మూకుమ్మడి రాజీనామాలు అర్థం ఏంటో తెలియడం లేదని అంటున్నారు.
ఎన్నికలు జరిగే వరకు, జరిగిన తరువాత తామంతా ఒక్క కుటుంబ సభ్యులే అనుకుంటూ వచ్చిన ‘మా’ పోటీదారులు ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నారని ఓటేసినవారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా గెలిచి తన ప్యానల్ లో కేవలం ఐదుగురు సభ్యులు గెలిస్తే ఇలాగే చేసేవారా..? అని అంటున్నారు. అసోసియేషన్ లో ప్రత్యర్థులు ఉంటేనే సమస్యలు పైకి వస్తాయి. వన్ సైడ్ ఉండడం వల్ల సినీ నటుల సమస్యలను ఎవరు ప్రస్తావిస్తారు..? అని చర్చించుకుంటున్నారు.
ఈ వివాదాన్ని తొందరగా ప్రశ్నించకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నిరసన తెలుపుతున్న సభ్యుల డిమాండ్ ప్రధానంగా ప్రస్తావించాలని అప్పుడే తమను గెలిపించిన వారికి నమ్మకం కలుగుతుందని అంటున్నారు. కేవలం తమకు అవమానం జరిగిందని రాజీనామాలు చేయడం వల్ల సినీ నటుల తరుపున ప్రకాష్ రాజ్ వర్గం ఎలా ప్రశ్నించగలుగుతారని అంటున్నారు.