MAA Election: ‘మా’ ఎన్నికలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. టాలీవుడ్ పై ఆధిపత్యం కోసం అటు కేసీఆర్.. ఇటు జగన్ పావులు కదుపుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడైతే తెలంగాణ సర్కార్ కు పట్టు ఉంటుంది. మంచు విష్ణు అయితే ఏపీ ఆధిపత్యం కనిపిస్తుంది.అందుకే ఈ ఇద్దరికి మద్దతుగా రెండు ప్రభుత్వాల పెద్దలు రంగంలోకి దిగినట్టు ప్రచారం సాగుతోంది.
మంచు విష్ణు.. స్వయానా ఏపీ సీఎం జగన్ బావమరిది. జగన్ బాబాయి కూతురునే విష్ణు పెళ్లి చేసుకున్నాడు. దీంతో వారి మధ్య బంధుత్వం బలపడింది. అయితే ఇప్పుడు సీఎం జగన్ ఏపీలో అధికారంలో ఉన్నాడు. పైగా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్నాడు. వరుస ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నాడు. అలాంటి ఓటమి ఎరుగని నేతకు ఇప్పుడు ‘మంచు విష్ణు’ గుదిబండగా మారారా? మంచు విష్ణు ఓడిపోతే అది జగన్ ఖాతాలోకి వెళుతుందా? విష్ణు ఓటమి ఏపీ సీఎంకు పరువు తక్కువా? అంటే ఔననే సమాధానం రాజకీయ, సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

పట్టుమని 1000 మంది ఓటర్లు కూడా లేని ‘మా’ ఎన్నికలపై ఇప్పుడు సినీ, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఇద్దరూ మీడియాకు ఎక్కి బట్టలిప్పి బజారున పడేలా విమర్శలు చేసుకుంటున్న తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రచ్చను టీవీ చానెల్స్ హైలెట్ చేస్తూ పండుగ చేసుకుంటున్నాయి. వారిని చర్చలకు పిలిచి గిచ్చి కయ్యం పెడుతూ టీఆర్పీ రేటింగులు పెంచుకుంటున్నాయి. ఫ్లోలో ఏమాట్లాడాలో తెలియక రెండు వర్గాలు ఇండస్ట్రీ లొసుగులు బయటపెట్టుకుంటూ పరువు తీస్తున్నాయి.
ఈ క్రమంలోనే మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో రాజకీయాలను ఇన్ వాల్వ్ చేశారు. ఏపీ సీఎం జగన్ బావమరిది అయిన విష్ణు తనకు జగన్, వైసీపీ నుంచి , నందమూరి ఫ్యామిలీ,టీడీపీ నుంచి మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇదే క్రమంలోనే ప్రకాష్ రాజ్ కు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ మద్దతు ఉందని.. కేటీఆర్, టీఆర్ఎస్ వర్గాలు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది.
‘మా’ ఎన్నికలు కాస్త ఇప్పుడు రాజకీయ రంగుగా మారి.. టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. మంచు విష్ణు దూకుడుతో వైసీపీని ఓన్ చేసుకోవడంతో స్వయంగా ఏపీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ‘మా’ ఎన్నికలతో సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి, వైసీపీకి సంబంధం లేదని వివరణ ఇచ్చిన పరిస్థితి. అయితే మంచు విష్ణు ఇప్పటికీ ప్రచారంలో వైసీపీ బ్యాచ్ ను వాడుకుంటున్నారన్న గుసగుసలు విమర్శలు వినిపిస్తున్నాయి.జగన్ ఆశీస్సులతోనే విష్ణు ఈసారి మా ఎన్నికల్లో పోటీచేస్తున్నాడన్న చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా సాగుతోంది.
ఎందుకంటే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీకి దిగడానికి కొద్దిరోజుల ముందు వ్యక్తిగతంగా అమరావతి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. జగన్ ను కలిశాకే ‘మా’ ఎన్నికల్లో దిగారు. దీంతో ఇదంతా జగన్ ప్రోద్బలంతోనే సాగుతోందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ పెద్దలు వస్తే కలవడానికి టైం లేదంటున్న జగన్ .. ఏకంగా మంచు విష్ణుతో మాత్రం సన్నిహితంగా మెలుగుతున్నారు. ‘మా’ ఎన్నికలతో సంబంధం లేదంటూనే వైసీపీ సర్కార్ వెనుకుండి నడిపిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఏబీఎన్ ఆర్కేతో ఇంటర్వ్యూలోనూ మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీచేయకుండా తాను కూడా ఆపలేనని.. అదంతా పైనుంచి నడిపిస్తున్నారని అనడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అందుకే మంచు విష్ణు.. చిరంజీవి, ఇతర పెద్దలు చెప్పినా ఏకగ్రీవానికి ఒప్పుకోలేదని సమాచారం.
ప్రస్తుతం తీరుచూస్తే ప్రకాష్ రాజ్ కు తెలంగాణ ప్రభుత్వ మద్దతు, చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ సపోర్టు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫైట్ ఖచ్చితంగా టీఆర్ఎస్, వైసీపీ అన్నట్టుగా సాగుతోందని.. విష్ణు ఓడిపోతే ఆ ఎఫెక్ట్ జగన్ పై పడుతుందని.. అందుకే ఏపీ ప్రభుత్వం పైకి తమకు సంబంధం లేదని అన్నదనే టాక్ వినిపిస్తోంది.
మంచు విష్ణును ముందుపెట్టి తెలుగు సినిమా పరిశ్రమను కంట్రోల్ చేయడానికి.. సినీ పరిశ్రమలోని కొంతమంది ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది. సినీ పరిశ్రమలోని కొందరి సాయంతో జగన్ టాలీవుడ్ ను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని.. అందుకే మంచు విష్ణును ముందు నిలిపి రాజకీయం చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో నెలవై ఉన్న టాలీవుడ్ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ సర్కార్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ కు దోస్త్ అయిన ప్రకాష్ రాజ్ గెలుపుకోసం టీఆర్ఎస్ బ్యాచ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక మంచు విష్ణు గెలిస్తే టాలీవుడ్ పై తమ అదుపు ఉంటుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మా ఎన్నికల ఫైట్ కాస్త ‘కేసీఆర్ వర్సెస్ జగన్’ గా మారింది.