2021 సంవత్సరంలో జనవరి నెల 1వ తేదీన దేశంలో టెక్నాలజీతో లింక్ అయిన కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల గుర్తించి అవగాహన పెంచుకుంటే ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.
కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత పలు రంగాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లింపు విధానాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీలోపు వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలి. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే టోల్ గేట్ల దగ్గర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వాహనాలకు ఫాస్టాగ్ ను తీసుకుంటే మంచిది.
వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఆ వాహనాలలో హైవేలపై, ఔటర్ రింగ్ రోడ్ లలో ప్రయాణించడం కుదరదు. టోల్ ప్లాజాల దగ్గర ఇకపై ఫాస్టాగ్ ఓన్లీ అనే క్యూ లైన్లే కనిపించనున్నాయని సమాచారం. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయడానికి గతంలో కేంద్రం గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. లైఫ్ సర్టిఫికెట్ ను ఇప్పటివరకు సమర్పించని వారు ఫిబ్రవరి 28వ తేదీలోగా సమర్పించాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి ఏటీఎం నియమనిబంధనల్లో కీలక మార్పులు చేయనుంది. ఆయిల్ కంపెనీలు ఫిబ్రవరి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలలో మార్పులు చేయనున్నాయి. ఫలితంగా సిలిండర్ ధర పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.