విజయ్ దేవరకొండను మరో బాధ్యతగల ‘పోకిరీ’లా చూపించే ప్రయత్నంలో దర్శకుడు పూరి జగన్నాథ్ సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నాడు. తాజాగా విజయ్ ను ఊర మాస్ బాక్సర్ గా చూపిస్తున్నాడు. ‘లైగర్’ సినిమాలో ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నాడు. రిలీజ్ కు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్ మొదలైంది. ఇప్పటికే ఒక పాట విడుదల కాగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల చేశారు.

‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. ‘వీ ఆర్ ఇండియన్స్.. మేము ఎవరికీ తీసిపోం.. సిస్టర్ నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం’ అంటూ పాట ప్రారంభంలో విజయ్ ఆగ్రహంతో చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషం పాటు సాగిన ఈ వీడియో పాటలో విజయ్.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృశ్యాలు చూపించారు.
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘లైగర్’. పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాడు. ముంబైలోని మురికవాడకు చెందిన యువకుడిగా విజయ్ దేవరకొండ నటించాడు. ఫుల్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. విజయ్ కు ఉన్న నత్తితో ఇబ్బందిపడుతూ పలికే డైలాగ్స్ అదిరిపోయాయి.ఈలలు వేయించేలా ఉన్నాయి.
విజయ్ తల్లి పాత్రలో రమ్యక్రిష్ణ పవర్ ఫుల్ రోల్ పోషించారు. హీరోయిన్ గా అనన్యపాండే నటించింది. ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
ఇక విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. దీన్ని దేశంలోని హిందీ, తెలుగు,తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.